-మంత్రి సత్యకుమార్ యాదవ్
నెల్లూరు,/పొదలకూరు. నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని కోటి 65 లక్షల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల ఆరోగ్య భీమా అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని,కొద్ది రోజులలో ఇది అమలులోకి వస్తుందని ,ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు.
శనివారం సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ను మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీనిద్వారా 1 కోటి 43 లక్షల పేద,22 లక్షల మధ్యతరగతి కుటుంబాలు లబ్ది పొందుతాయన్నారు.ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ పథకం కింద గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో కేవలం 7 మాత్రమే ప్రారంభించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పది నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 18 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. అందులో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రంలో డయాలసిస్ రోగులు పెరుగుతున్న వైనంపై శాస్త్రీయంగా పరిశోధించామని, కేవలం గత ప్రభుత్వంలో నాసిరకమైన మద్యం తాగటం వల్లనే కిడ్నీ , లివర్ కేసులు, నరాలకు సంబంధించిన కేసులు రెట్టింపైనట్లుగా గమనించామన్నారు. గత ప్రభుత్వం ప్రజారోగ్యంతో చెలగాటమాడటంతో కొన్ని వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడ్డాయన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన మెరుగైన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత పది నెలల్లో 4 లక్షల 95 వేల డయాలసిస్ చేసే సెషన్లు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఆరు లక్షల వరకు సెషన్లు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా స్టెమి కార్యక్రమం ద్వారా గుండెపోటుకు గురైన వారికి గోల్డెన్ అవర్ లో అందించేందుకు 45000 ఖరీదు చేసే ఇంజక్షన్లను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఈవిధంగా ఇప్పటివరకు 2800 మందికి ఇంజక్షన్లు అందించామని వారిలో కేవలం 12 మంది మాత్రమే చనిపోయారన్నారు . ఆ విధంగా 2788 మంది ప్రాణాలను కాపాడామన్నారు . పేద ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు .అదేవిధంగా నాలుగు కోట్ల పది లక్షల మందికి ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటివరకు మూడు కోట్ల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. వివిధ రకాల క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. అందుకోసమే ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్లు పెట్టి ప్రత్యేక వైద్యుల ద్వారా చికిత్సలు అందిస్తున్నామన్నారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను పేద ప్రజల ప్రాణం పోకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఐదు పడకల తో పాటు తమ సొంత నిధులతో మరో మూడు పడకలను ఏర్పాటు చేస్తున్న గొప్ప కార్యసాధకులు సోమిరెడ్డి అని కొనియాడారు.
శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రభుత్వ వైద్య శాలకు వెళ్ళ వచ్చనే ధైర్యం వచ్చిందన్నారు. సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఎముకలు కీళ్లు సంబంధించిన డాక్టర్ను నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పొదలకూరు ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల నుండి 50 పడకలకు పెంచాలని మంత్రికి విన్నవించారు. ప్రజా జీవితంలో గౌరవంగా బ్రతకాలని జిల్లా చరిత్రలో ద్వేషపూరిత రాజకీయాలకు తావు లేదన్నారు. అదేవిధంగా వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రజలకు సేవ చేయాలనే తపన గల వ్యక్తి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, డి సి హెచ్ ఎస్ మునుస్వామి, స్తానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News