విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మే 6న జీరో షాడో దే సందర్భంగా గోరా టెక్నో హబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్ధులు, వాసవ్య మహిళా మండలి వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న బాలికలు, పలువురు నగర పౌరులు స్వచ్ఛందంగా విచ్చేసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సెర్చ్ క్యాంపెయిన్ జాతీయ సహాయ కన్వీనర్ శ్రీమతి మేకా సుసత్య రేఖ, విచ్చేసిన అందరిని కార్యక్రమంలో భాగస్వాములను చేసారు. కొందరిని పలు రకాల పొజిషన్స్ లో నిలబెట్టి, ఇంకొందరితో తెల్లటి పేపర్పై స్కేల్ని బిగించి, మరికొందరితో తెల్లటి పేపరుపై నిటారుగా పెన్సిల్ని నిలబెట్టి సూర్యుడు ఎలా కదులుతున్నాడు. జీరో షాడో సమయాన్న ఎలా నీడ మాయమై మన క్రిందకు చేరుతుందో విపులంగా వివరిస్తూ ప్రత్యక్షంగా చూపించారు. నీడ కోల్పోయిన ఆ దృశ్యాన్ని అందరూ ఎంతో ఆసక్తిగా తిలకించి ఆనందించారు. ఈ ఖగోళ అద్భుతాన్ని ఎంతో సరళంగా వివరించడమే కాక ప్రత్యక్షంగా ఎలా తిలకించాలో చూపించిన ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత అయిన ముఖ్య అతిధి శ్రీమతి మేకా సుసత్య రేఖగారికి విచ్చేసిన అందరూ ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసారు. ఈ ఆసక్తికర ఖగోళ పరిణామం తిరిగి ఆగస్టు 7న తిలకించవచ్చని శ్రీమతి మేకా సుసత్య రేఖ తెలియచేసారు. పిల్లల్లో సైన్సు & టెక్నాలజీపై ఆసక్తిని పెంపొందించే దిశలో గోరా టెక్నో హబ్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. గోరా టెక్నో హబ్ ఛైర్మన్ డా|| సమరం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి కార్యదర్శి రశ్మి, గోరా సైన్సు సెంటర్ డైరెక్టర్ నియంత, సకల, డా||జగతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News