-టెండర్ల ఖరారు ప్రక్రియ, ఏజన్సీల ఎంపిక ఎంతో పారద్శకంగా జరిగింది
-నిర్ణీత లక్ష్యాన్ని మించి కుట్టు శిక్షణకు మహిళల నుండి అనూహ్య స్పందన
-రాష్ట్ర బి.సి.,ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని బడుగు, బలహీన మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల సాధికారిత లక్ష్యంగా కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నదని రాష్ట్ర బి.సి., ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబరులో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి పలు కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బి.సి. సంక్షేమానికై ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.48 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించడం జరిగిందన్నారు.
అదే విధంగా మహిళా సాధికారతకై పెద్ద ఎత్తున కుట్టు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఈ కార్యక్రమానికి మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తున్నదన్నారు. దాదాపు 1,02,800 మందికి కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని అందజేయాలని లక్ష్యంగా నిర్థేశించుకోగా, ఇప్పటికే దాదాపు 3.36 లక్షల మంది కుట్టు శిక్షణ పొందేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 720 కేంద్రాల్లో కుట్టు శిక్షణా కార్యక్రమాలను అందజేయడం జరుగుచున్నదన్నారు. ఎంతో పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ప్రతి పక్షపార్టీ నాయకులు విమర్శించడం సమంజసం కాదన్నారు.
G.O.Ms.No.94. Irrigation and CAD (PW-COD) Department, Dt.01-07-2003 లో నిర్దేశించబడిన విధముగా టెండర్ డాక్యుమెంట్ తయారు చేయుట నుండి స్కిల్ ట్రైనింగ్ పార్టనర్‌ను ఎంపిక చేసి సంబంధిత శిక్షణ కార్యక్రమాన్ని అప్పగించే పర్యంతము ప్రభుత్వము నిర్దేశించిన విధివిధానములు పాటించటం జరిగిందన్నారు. ఎంతో పారదర్శకంగా నిర్వహించిన ఈ టెండర్ ప్రక్రియలో అర్హత సాధించిన ఎల్.1, ఎల్.2 మరియు ఎల్.3 బిడ్డర్ లను ఎంప్యానెల్మెంట్ చేయడమైందన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఒక గంట శిక్షణ ప్రక్రియకు రూ 49/- లు నిర్ణయించగా 360 గంటల శిక్షణకు గాను 17,640/- లు కాగా, ఎంపిక చేయబడిన సంస్థలకు రూ.15,599/- గా నిర్ణయించడమైందన్నారు.
టెండర్ ప్రక్రియకు ముందు ప్రభుత్వం ఆమోదించబడిన యూనిట్ విలువ రూ.25,000/- లు అయినప్పటికీ, టెండర్ ప్రక్రియ పూర్తికాబడిన తదుపరి L1 రేటు ప్రకారం ట్రైనింగ్ ఖర్చులు మరియు ISI ప్రామాణికం కలిగిన నాణ్యమైన కుట్టు మిషను (రెండు సంవత్సరముల వారంటీతో) వెరసి ఒక్కొకరికి రూ.21,798/- చొప్పున రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ ఆమోదించడమైందన్నారు.
శిక్షణ కార్యక్రమము నిర్వహణ విషయములో APCFSS వారి సహకారముతో ఆధార్ బేస్డ్ ఫేషియల్ రెకగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతిరోజు శిక్షణ ప్రారంభ సమయము మరియు శిక్షణ ముగింపు సమయము నందు రెండు పర్యాయాలు అటిండెన్సు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. కుట్టు మిషన్లను శిక్షణా కార్యక్రమము పూర్తి అయిన పిదప 75 % హాజరు సాధించిన మహిళల కు మాత్రమే కుట్టు మిషన్లను అందజేయడం జరుగుచున్నదన్నారు.
రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి శిక్షణ కేంద్రములో శిక్షణ పొందే వారికి అవసరమైన టేపు, కత్తెర, స్కేల్ తదితర ఉపకరణములను సంబందిత స్కిల్ ట్రైనింగ్ పార్టనర్ ద్వారా అందజేయడం జరుగుచున్నదన్నారు. అద్దె భవనాలకు చెల్లించవలసిన అద్దెను కూడా శిక్షణ భాగస్వామ్యులు చెల్లిస్తున్నారన్నారు. SEEDAP, APITCO, దీనదయాల్డ్ గ్రామీణ కౌశల యోజన సంస్థలు కూడా వివిధ ప్రయివేటు శిక్షణా భాగస్వాముల ద్వారానే కుట్టు శిక్షణను ఇవ్వడం జరుగుచున్నదన్నారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎ.మల్లికార్జున మాట్లాడుతూ కుట్టు శిక్షణ కార్యక్రమములో మోబిలైజేషన్ అడ్వాన్సు చెల్లించడం లేదన్నారు. శిక్షణ కార్యక్రమము ప్రారంభ మైన 10 రోజుల తర్వాత 75% అటెండెన్స్ ఉన్న అభ్యర్ధులకు సంబందించి శిక్షణ రుసుమును 35 %, 30 రోజుల శిక్షణ అనంతరము 75% అటెండెన్స్ ఉన్న అభ్యర్ధుల తాలూకు 35% రుసుము చెల్లించుట జరుగుచున్నదన్నారు. శిక్షణ కార్యక్రమము పూర్తిగా ముగిసిన తదుపరి, లబ్దిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. సంబందిత బిల్లులను అధికారుల దృవీకరణ తదుపరి మిగిలిన సొమ్మును చెల్లించడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News