-రాజమహేంద్రవరంలో గెయిల్ కార్పొరేట్ సంస్థ ఏర్పాటు చేసిన “చిన్నారి ఆరోగ్యం” కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-చిన్నారులను పోషకాహార లోపం నుండి సంపూర్ణ పోషణ వైపుకి నడిపిస్తున్న ప్రతి ఒక్కరి కృషిని ప్రశంసించిన మంత్రి దుర్గేష్
-చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో తూర్పుగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్ పి. ప్రశాంతిని అభినందించిన మంత్రి దుర్గేష్
-గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నఅంగన్ వాడీల పనితీరును కొనియాడిన మంత్రి దుర్గేష్
-పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు క్రమం తప్పకుండా ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
-ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచన
-చిన్నారి ఆరోగ్యం గోడ పత్రిక ఆవిష్కరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోషకాహార లోపం, ఆర్థికపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో సరైన అవగాహన లేమి, బలవర్థకమైన ఆహారం అందకపోవడం తదితర కారణాలతో సరైన రీతిలో ఎదగని చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం “చిన్నారి ఆరోగ్యం” కార్యక్రమం రూపొందించడం శుభ పరిణామం అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.. శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో గెయిల్ లిమిటెడ్ కంపెనీ వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)నిధులతో ఏర్పాటు చేసిన “చిన్నారి ఆరోగ్యం” కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం లో భాగంగా “చిన్నారి ఆరోగ్యం”పోస్టర్ ను ఆవిష్కరించారు. అంగన్వాడీ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ను సందర్శించి, అక్కడి పదార్థాలను రుచి చూశారు. అనంతరం ఈనెలాఖరున పదవీ విరమణ చేయనున్న జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి ని సన్మానించారు. కార్యక్రమం చివర్లో బాలింతలకి శ్రీమంతం, చిన్నారులకు గ్రాడ్యుయేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ తరహా కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి ఆదర్శం గా (రోల్ మోడల్) గా నిలవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో అన్ని చోట్లా జరగాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో 6 నెలల వయస్సు నుండి ఆరేళ్ల వయసు గల దాదాపు 74,238 మంది చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేయడం సంతోషకరమని మంత్రి దుర్గేష్ అన్నారు. అందులో 1438 మంది చిన్నారులు ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వారి కోసం “చిన్నారి ఆరోగ్యం” పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, తద్వారా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి,సామాజిక బాధ్యతతో ఆయా చిన్నారులను పోషకాహార లోపం నుండి సంపూర్ణ పోషణ వైపుకి నడిపించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన ప్రతి ఒక్కరి కృషిని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు.
ప్రత్యేకించి విభిన్న కారణాలతో బలవర్థక బాలలుగా ఎదగలేకపోయిన చిన్నారులను పోషకాహార లోపం నుండి సంపూర్ణ పోషణ వైపుకి నడిపిస్తూ రాష్ట్రంలోనే తూర్పుగోదావరిని ఆదర్శ జిల్లాగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న కలెక్టర్ పి. ప్రశాంతిని మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక బాధ్యతతో ఇంతటి మహత్తర కార్యక్రమం చేపట్టేందుకు ఆర్థిక సహకారం అందించిన గెయిల్ యాజమాన్యాన్ని ప్రశంసించారు.ప్రత్యేక పోషకాహార విలువలున్న ఆహార కిట్ ను ప్రతి నెలా చిన్నారులకు అందజేయాలన్న గెయిల్ యాజమాన్యం ఉద్దేశం మంచిదన్నారు. బాలమిత్రల ద్వారా చిన్నారుల డేటాను రూపొందించడం తద్వారా సమగ్ర కార్యక్రమంగా రూపొందించడం అభినందనీయమన్నారు. తమ ఇబ్బందులను అధిగమించి క్షేత్రస్థాయిలో చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యంగా, అంగన్ వాడీకి వచ్చే బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్న అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లను మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ శిశువు శారీరక, మానసిక అభివృద్ధి కి కీలకమైన తొలిదశలో వారి భద్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రాముఖ్యతనివ్వాలని సూచించారు.మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి దుర్గేష్ వివరించారు. గర్భవతులు, బాలింతలకు పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.పిల్లల ఆరోగ్యంలో సమస్యలు, వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం, పోషకాహారలోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని సూచించారు. ప్రమాదకరమైన హెచ్ఐవి బారిన పడిన పిల్లలకి సరైన పోషక ఆహారం అందజేస్తే వారి జీవిత కాలం పొడిగించడం సాధ్యం అవుతుందని తెలిపారు.. క్రమం తప్పకుండా పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత తో కూడినదిగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ను వివరించారు. ఉద్యోగులు ఒక బాధ్యతతో విధి నిర్వహణలో భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు.. ఇందులో ప్రజలని, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చెయ్యాలని మంత్రి సూచించారు. సమాజంలో ఆరోగ్య వంతమైన పిల్లలు తయారైతేనే ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుందన్నారు. స్త్రీ,శిశు సంక్షేమం, వైద్య శాఖలకు చెందిన అధికారులు అంతా కలిసి చేస్తున్న కార్యక్రమం సత్ఫలితాలిస్తోందన్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగానికి, జీతానికి సంబంధం లేకుండా కష్టపడుతున్నారని కొనియాడారు.
జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ.. సమాజంలో ఎవరైతే ఆరోగ్య ప్రయోజనాలు పొందలేక పోతున్నారో, సరైన పోషక విలువలు కలిగిన ఆహారం పొందలేక పోతున్నారో అటువంటి వారిని గుర్తించి అందుకు అనుగుణంగా తగిన అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషక విలువలు పెంచే దిశగా తల్లితండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ను ఇందులో భాగస్వామ్యం చెయ్యాలనే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.. గతంలో జిల్లాలో విజయవంతంగా చేపట్టిన బంగారు కొండ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశం తో “చిన్నారి ఆరోగ్యం” కార్యక్రమం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం, తల్లితండ్రులు తీసుకోవలసిన జాగ్రత్త ల పై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.అతితీవ్ర పోషకాహార లోపం ఉన్న 6 నెలల నుండి 6 సంవత్సరముల వరకు ఉన్న పిల్లల తో పాటుగా క్షయ, హెచ్ ఐ వి పాజిటివ్, సికిల్ సెల్ అనీమియా, తలసీమియా, తదితర వ్యాదులతో బాధపడుతున్న పిల్లలకు కూడా “చిన్నారి ఆరోగ్యం” కిట్లు అందిస్తూ వారి ఆరోగ్య పర్యవేక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లాలో 1448 అతితీవ్ర పోష కాహారం లోపం ఉన్న పిల్లలు, 95 మంది తీవ్ర అనారోగ్యము తో బాధపడుతున్న పిల్లలు అందరికి బాలమిత్ర లను గుర్తించి చిన్నారి ఆరోగ్యం పిల్లలతో వారిని మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. బాలమిత్ర లు ప్రతి బుధవారం చిన్నారి ఆరోగ్యం పిల్లలను సందర్శించి వారి ఎత్తు, బరువు, ఆరోగ్యస్థితిని పరీక్షించి ఆ వివరాలు చిన్నారి ఆరోగ్యo యాప్ లో అప్లోడ్ చేస్తారు. నెలకు ఒకసారి పోషాహారం కిట్స్ పంపిణి చెయ్యడం, వారి ఆరోగ్య వివరాలు అప్లోడ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ, కొన్ని వ్యాధులు వంశపార్య పరంగా రావడం, సరైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించక పోవడం, ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చిన్న పిల్లలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహార పదార్ధాలు తీసుకోవాలని , ప్రభుత్వ ఆసుపత్రులలో అందచేస్తున్న ఆరోగ్య సేవలు వినియోగించు కోవాలని కోరారు. పోషక విలువలతో కూడిన చిన్నారి ఆరోగ్యం కిట్ ను చిన్నారి ఆరోగ్యం పిల్లలకు అందించి అది సక్రమముగా వినియోగించేలా చూస్తామని , “చిన్నారి ఆరోగ్యం” కార్యక్రమం లో గుర్తించిన పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.
గెయిల్ ప్రతినిధులు జనరల్ మేనేజర్ వై ఎ కుమార్ మాట్లాడుతూ, చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం లో గెయిల్ ను భాగస్వామ్యం చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. చిన్నారులకు సంపూర్ణ పోషణ కూడిన ఆహారం అందచేసే ప్రక్రియలో గెయిల్ సంస్థ ద్వారా రూ.38 లక్షల ఆర్థిక చేయూత అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి, గెయిల్ ప్రతినిధులు డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ ఆర్) దీవి ప్రభాకర్ , డిజిఏం కే. రాజన్, అమరావతి సొల్యూషన్స్ అనిల్ కుమార్, డి ఎమ్ హెచ్ వో కే వెంకటేశ్వరరావు, డిప్యూటీ డి ఎమ్ హెచ్ వో ఎన్ వసుంధర, ఆర్ ఎమ్ సి, ఐ సి డి ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News