విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు, పరివార దేవతలకు ఈరోజు విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి. ఆదివారం సందర్బంగా ఆది దంపతుల సన్నిధిలో వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విసృతంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణార్చన, శాంతి కళ్యాణం,చండీ హోమం,సూర్యోపాసన తదితర పూజల్లో విశేషరీతిలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించిన వాట్సాప్ సేవ ద్వారా పూజల టిక్కెట్ లు ముందుగా భక్తులు బుక్ చేస్తున్నారు. వివాహాల సీజన్, వేసవి రద్దీ సందర్బంగా ప్రతీ ఒక్క భక్తునికీ శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనం సులభతరంగా పూర్తి అవ్వాలనే ధ్యేయంతో దేవాలయ సిబ్బంది క్యూ లైన్ల క్రమబద్దీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టడమైనది.
కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ దర్శనం టికెట్ స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్స్, టికెట్ పంచింగ్ పాయింట్ లను పరిశీలించారు. దర్శనం కి ఎంత సమయం పడుతుంది అనే విషయం లో భక్తుల స్పందన తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయంలో భక్తుల రద్దీ క్రమబద్దీకరించారు. వివిధ క్యూ మార్గాల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దేవస్థానం అందిస్తున్న ఉచిత ప్రసాదము, నిత్య అన్నప్రసాదమును భక్తి శ్రద్దలతో స్వీకరించారు.
చలివేంద్రాలు ద్వారా భక్తులకు త్రాగునీరు, ఉచిత మజ్జిగ పంపిణీ చేసి భక్తుల దాహార్తిని తీర్చే చర్యలు చేపట్టడమైనది. కార్యనిర్వహణాధికారి ఈ ఏర్పాట్లు పరిశీలించారు. ఉచిత ప్రసాద వితరణ నిరంతరం కొనసాగింది. ఉచిత ఆరోగ్యకేంద్రం, మైక్ ప్రచార కేంద్రం లను కార్యనిర్వహణాధికారి పరిశీలించి, భక్తులసేవలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది పర్యవేక్షించారు. ఎస్. పి. ఎఫ్ పోలీస్ అవుట్ పోస్ట్ పరిశీలన చేసి, డ్యూటీ చార్ట్ వివరాలు పరిశీలించారు. భక్తుల రద్దీ అనుసరించి ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.
Prajavartha Online Telugu News