విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీలింగ్ ల్యాండ్స్‌కు సంబంధించిన కేసులలో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారుల( ఆర్‌డివో)ను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు.
నగరలోని కలెక్టరేట్ నుండి గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సీలింగ్ ల్యాండ్స్ కేసుల పై తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై విజయవాడ నందిగామ తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏపి ల్యాండ్ రిఫార్మ్స్ (సి.ఓ.ఎ.హెచ్) యాక్ట్, 1973 ప్రకారం ఆర్.డి.ఓ లు వారి డివిజన్ పరిధిలో ట్రిబ్యునల్ అథారిటీ కావున సంబంధిత కేసులను తక్షణమే పరిష్కరించి, సీలింగ్ ల్యాండ్స్ కింద ఆ భూములను స్వాధీనం చేసుకొని 22`ఏ నిషేదిత జాబితా నందు సంబంధిత వివరాలను పొందుపరచాలని ఆదేశించారు.
ఇప్పటికే ప్రభుత్వము స్వాధీనము చేసుకున్న సీలింగ్ భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటికి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ అవసరాల నిమిత్తం వినియోగించవలసినదిగా ఆదేశించారు. ఇంకనూ విచారణ లో ఉన్న కేసులను తక్షణమే పరిష్కరించి సీలింగ్ భూములను స్వాధీనం చేసుకుని, సర్వే నెంబరు, విస్తీర్ణాలను నిషేదిత జాబితాలో పొందుపరచాలన్నారు. ఆ భూములకు సంబంధించి ఏ విధమైన రిజిస్ట్రేషన్లు జరగకుండా సంబంధిత సబ్-రిజిస్ట్రార్‌లను ఆదేశించాలన్నారు. సీలింగ్ ల్యాండ్స్ అంశానికి సంబంధించి ప్రాధాన్యత దృష్ట్యా ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో ఎం లక్ష్మీ నరసింహం, భూసేకరణ విభాగం సూపరింటెండెంట్ సిహెచ్. దుర్గాప్రసాద్‌లు ఉన్నారు.
Prajavartha Online Telugu News