-తపాలా సేవల మెరుగుపరచే దిశగా నిర్ణయమన్న కేంద్రం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో టిపి-25 ఆర్ఏంఎస్ విభాగాన్ని నిలిపివేసిన కేంద్ర తపాలా శాఖ నిర్ణయంపై తిరుపతి ఆర్ఏంఎస్ డివిజన్‌కు చెందిన పోస్టల్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్పు తిరుపతి ప్రాంతంలో తపాలా సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న తిరుపతి ఆర్ఏంఎస్ డివిజన్‌కు ఈ నిర్ణయం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులు తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తికి వినతి పత్రం సమర్పించారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ గురుమూర్తి కేంద్ర తపాలా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖపై తపాలా శాఖ కార్యదర్శి స్పందిస్తూ, టిపి -25 ఆర్ఏంఎస్ విభాగం తపాలా మార్పిడికి పరిమిత స్థాయిలోనే ఉపయోగపడుతోందని, తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య మాత్రమే తపాలా మార్పిడి జరుగుతుందని, మధ్యలో ఉన్న స్టేషన్లలో తపాలా మార్పిడి తక్కువ పరిమాణంలో జరుగుతోందని తెలిపారు. తిరుపతి–హైదరాబాద్, తిరుపతి–బెంగళూరు మధ్య ఉన్న వైమానిక మార్గాలు, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ ద్వారా సమయానికి తపాలా పంపిణీ జరుగుతోందని స్పష్టం చేశారు. తపాలా పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా, భద్రతగా ఉండేందుకు తిరుపతి – కడప – కర్నూలు – అనంతపురం, తిరుపతి – కర్నూలు – నంద్యాల – విజయవాడ – గుంటూరు మద్య రెండు కొత్త ఆంతర్గత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ మార్గాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ వాహనాలు లాక్ చేసి, సీల్ చేసిన విధానంతో పాటు జిపిఎస్ ట్రాకింగ్ సౌకర్యంతో కూడి ఉండి, తపాలా భద్రత, సమయపాలన మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తపాలా సేవల నాణ్యతపై ప్రభావం లేకుండా, ఈ కొత్త వ్యవస్థ వల్ల ప్రజలకు వేగవంతమైన, విశ్వసనీయమైన సేవలు అందుతాయని కేంద్ర తపాలా శాఖ స్పష్టం చేసింది.
Prajavartha Online Telugu News