Breaking News

ఆపరేషన్‌ కగార్‌ ఆపాలి.

-మావోయిస్టుపార్టీతో శాంతియుత చర్చలు జరపాలి.
-బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలి.
-మృతదేహాలను బంధువులకు అప్పగించాలి.
-రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఉపసంహరించాలని, సీపీఐ(మావోయిస్టు) పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతియుత చర్చలు జరపాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. మావోయిస్టు నేత నంబాల కేశవరావుతోపాటు మృతుల భౌతిక కాయాలను వారి బంధువులకు అప్పగించాలని తీర్మానించింది. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు వామపక్ష పార్టీలు, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు, మేధావులు హాజరయ్యారు.

రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో..సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టిన 9 అంశాలతో కూడిన తీర్మానాన్ని రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఇంకా అనేక మంది పార్టీ నాయకులు, ఆదివాసీలను బూటకపు ఎదురు కాల్పుల పేరిట మోడీ ప్రభుత్వం హత్మ చేసిన చర్యను ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. నంబాల కేశవరావుతోసహా మృతుల భౌతికకాయాలను వారి బంధువులకు అప్పగించాలని ఈ సమావేశం తీర్మానించింది. నారాయణపూర్‌ మారణకాండతోసహా అడవుల్లో సాగిస్తున్న మారణహామంపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ చేయించాలని, ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఉపసంహరించి, సీపీఐ (మావోయిస్టు) పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని డిమాండ్‌ చేసింది. బూటకపు ఎదురు కాల్పులలో పేరిట జరిగే మారణకాండపై నిరసన వ్యక్తంచేసే ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని ఈ సమావేశం నిరసించింది. ఖనిజ సంపదలు, ప్రకృతి వనరులతో కూడిన అడవులను బడా కార్పొరేట్లకు అప్పగించే ఆపరేషన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజాస్వామిక ఉద్యమానికి ఈ సమావేశం సంఫీుభావం ప్రకటిస్తూ తీర్మానించింది. ఆదివాసీయుల హక్కులను రాజ్యాంగ బద్దంగా పరిరక్షించాలని, అటవీ ప్రాంతాల్లో మోహరించిన పారా మిలటరీ, పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది.

ఈ సమావేశంలో సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ, ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దమనకాండను ఆపాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు 27 మంది నిండు ప్రాణాలను బలిగొన్నారని, ఇవి ఎన్‌కౌంటర్లు కాదని, ప్రభుత్వ హత్యలేనని పునరుద్ఘాటించారు. సాక్ష్యాత్తూ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ..సైతం ఈ ఎన్‌కౌంటర్లు చేసిన వారిని అభినందిస్తూ ప్రకటన ఇవ్వడం సిగ్గుచేటన్నారు. పైపెచ్చూ వారి భౌతిక కాయాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా..నాలుగైదు రోజులుగా జాప్యం చేయడాన్ని తప్పుపట్టారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చాక..ఇంత దుర్గార్గంగా ఏ ప్రభుత్వమూ వ్యవహరించలేదని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదివాసీయులను ఊచకోత కోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో అటవీ సంపదను కార్పొరేట్‌లకు దోచిపెట్టడానికే ఈ బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతోందన్నారు. దీనిని సీపీఐ, వామపక్షాలు, ఇతరత్రా ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయన్నారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమైన తరుణంలో వారితో చర్చలను కేంద్రం కొనసాగించాలని, ఈ బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జ్యూడిషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

సీపీఎం రాష్ట్ర నాయకులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఉన్న మొత్తం సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ఆపరేషన్‌ కగార్ పేరుతో… మావోయిస్టులను, ఆదివాసీయులను కాల్చి చంపుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ఆదివాసీల హక్కులు హరిస్తే..ఏం రాజకీయ పార్టీలు అంగీకరించబోవన్నారు. సైద్ధాంతికంగా అనేక విభేదాలు ఉన్నప్పటికీ…పౌరహక్కుల కోసం సమైక్యంగా ఉద్యమించాలని కోరారు. ట్రంప్‌ ఆదేశాలతోనే ఆపరేషన్‌ సిందూరను మోదీ అర్థాంతంగా ఆపేశారని మండిపడ్డారు.
సీపీఐ (ఎంఎల్‌) నాయకులు జాస్తి కిశోర్‌బాబు మాట్లాడుతూ మావోయిస్టులు చర్చలకు వస్తానంటే..మోదీ ప్రభుత్వం వారిని ఆహ్వానించకుండా, కాల్చిచంపడం దారుణమన్నారు. కార్పొరేట్‌లు, దోపిడి వర్గాలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, రాజ్యాంగ విలువలకు కట్టుబడకుండా పైశాచిక చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు డి.హరినాథ్‌ మాట్లాడుతూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, విప్లవకారులు, రచయితలు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులపై ఎన్‌కౌంటర్ల పేరుతో మారణకాండ, దాడులు చేస్తున్నారని అన్నారు. మోదీ పాకిస్తాన్‌తో చర్చలు చేస్తున్నారేగానీ, ఈ దేశం పౌరులతో చర్చలకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎంసీపీఐ నాయకులు ఖాదర్‌ భాషా మాట్లాడుతూ మావోయిస్టులను చంపి సంబరాలు చేసుకోవడం దుర్మార్గమైన చర్యన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ఎం.రామకృష్ణ మాట్లాడుతూ కేవలం మావోయిస్టులు, ఆదివాసీయుల అంతమే మోదీ ఉద్దేశ్యం కాదనీ, ఈ దేశ అటవీ సంపదను కార్పొరేట్‌లకు కొల్లగొట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ఎస్‌యూసీఐ నుంచి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ అంతర్గతంగా తమను విభేదించే వారిని అంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఉందని, ఈ తరుణంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాశిస్టు విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు సైద్ధాంతిక, ప్రజాతంత్ర ఉద్యమాలు చేయాల్సి ఉందన్నారు. విరసం రాష్ట్ర నాయకులు అరసవల్లి కృష్ణ మాట్లాడుతూ మావోయిస్టుల భౌతిక కాయాలను అప్పగించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రి అమిత్‌షా, రాష్ట్ర సీఎం చంద్రబాబు సహకరించడంలేదని, ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు చందిన మంత్రి అచ్చన్నాయుడు అడ్డుపడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఆపరేషన్‌ కగార్‌ పేరుతో…450 మందిని హతమార్చారని, వారంతా మావోయిస్టులే కాదనీ, మహిళలు, ఆదివాసీయులు, కూలీలు ఉన్నారని వివరించారు. దళిత బహుజన ఫ్రంట్‌ నాయకులు కొరివి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ మావోయిస్టుల ఫోటోలు చూస్తే..అది ఎన్‌ కౌంటర్‌ కాదనీ.. హత్యాకాండ అనీ స్పష్టమతోందని, ఈ దుర్మార్గమైన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవానీ మాట్లాడుతూ ఆపరేషన్‌ కగార్‌కు లక్షమంది సైనికులు అవసరమా?, అమాయక ఆదివాసీయులను ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేయడం దుర్మార్గమన్నారు. పౌర హక్కుల సంఘం నాయకులు భరద్వాజ, ఆంజనేయులు, ఇఫ్టూ నాయకులు పోలారి తదితరులు మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకని మావోయిస్టుల అంతానికి పొల్పడే చర్యలు దుర్మార్గమని తూర్పారబట్టారు.

ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.కోటేశ్వరరావు, సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్‌జీ, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్టి రాయప్ప, ప్రజా సంఘాల నాయకులు సందీప్‌, అఫ్సర్‌, నక్కా వీరభ్రద్రరావు, సాంబశివరావు, విశ్రాంత ప్రొఫెసర్‌ సీవీ నరసింహారావు, విశ్రాంత ప్రిన్సిపాల్‌ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *