Breaking News

మోడీ ఒక విఫల ప్రధాని… : కె.రామకృష్ణ

-జపాన్‌ ఆర్థిక వ్యవస్థతో పోలికకాదు.. భారత్‌ చైనాతో పోటీపడాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో రూపాయి విలువ తగ్గించి, పేదరికం, నిరుద్యోగాలను పెంచిన నరేంద్రమోడీ విఫల ప్రధానిగా ఖ్యాతికెక్కారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు.
ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో 4వ స్థానానికి చేరిందని, అందుకు ప్రధాని నరేంద్రమోడీ విధానాలే కారణమని గత రెండుమూడు రోజులుగా ఎన్‌డిఎ నేతలు పెద్దఎత్తున ఊదరగొడుతున్నారు. ఇందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు ముందుపీఠీన ఉన్నారు. సీనియర్‌ రాజకీయ, ఆర్థిక వేత్తగా, అన్ని విషయాలు అవగాహన కలిగిన చంద్రబాబు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడంలో అగ్రభాగాన ఉన్నారు. వాస్తవానికి భారతదేశం ప్రపంచంలో 4వ స్థానానికి ఎక్కడ చేరిందంటే… 12 కోట్ల జనాభా ఉన్న జపాన్‌ దేశ ఆర్థిక వ్యవస్థ 4.186 ట్రిలియన్‌ డాలర్స్‌ ఉంటే, 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4.187 ట్రిలియన్‌ డాలర్స్‌గా ఉంది. అంటే దాదాపు జపాన్‌, భారత్‌లు సమానంగా ఉన్నాయి. దీనినే బ్రహ్మాండం బద్ధలైనట్లుగా చెబుతున్నారు. జపాన్‌లో తలసరి ఆదాయం 39,350 డాలర్లుగా ఉండగా, భారత్‌ తలసరి ఆదాయం 2,880 డాలర్లుగా ఉంది. ఇదేనా జపాన్‌తో పోటీపడడం? మోడీ ఏదో సాధించేసినట్లు, భారత్‌ ఎంతో ముందుకెళ్లిపోయినట్లుగా ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలా ఉందేతప్ప మరొకటి కాదు.
ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేశం అమెరికా ఆర్థిక వ్యవస్థ 30.5 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. అమెరికాతో పోటీపడలేనప్పుడు కనీసం 140 కోట్ల జనాభా కలిగిన చైనాతోనైనా పోటీపడాలికదా. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 1948`49 ప్రాంతంలో చైనాలో విప్లవం జయప్రదమైంది. 1987లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 0.27 ట్రిలియన్‌ డాలర్లుగా ఉండగా, చైనా కూడా ఆనాడు అదే విధంగా ఉంది. 1987 వరకు భారత్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు సమానంగానే ఉన్నాయి. కాని నేడు చైనా ఆర్థిక వ్యవస్థ 19.23 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. భారత్‌ కనీసం చైనాతో పోటీ పడాల్సిందిపోయి, జపాన్‌తో పోల్చుకోవడం తగునా? ఇది పక్కాగా ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటికాదు.
నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యేనాటికి భారతదేశానికి ఉన్న అప్పులు రూ.84 లక్షల కోట్లు. మోడీ ప్రధాని అయిన తరువాత గత 10 ఏళ్లకాలంలో చేసిన ఘనకార్యం రూ.84 లక్షల కోట్ల అప్పులను రూ.224 లక్షల కోట్లకు పెంచడమే. మోడీ ప్రధాని అయ్యేనాటికి డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.61లు ఉండగా, నేడు రూ.85కు పైగా చేరింది. గత 10 ఏళ్ల క్రితం భారత్‌లో 97 మంది బిలియనీర్లు ఉండగా, నేడు 210కి చేరారు. బిలియనీర్ల సంఖ్య జపాన్‌లో తగ్గి, భారత్‌లో పెరిగి సంపదంతా కొద్దిమంది చేతుల్లోకి పోతోంది. ప్రస్తుతం భారత్‌లో రూపాయి విలువ పతనమయ్యింది. లక్షల కోట్ల రూపాయల అప్పులు పెరిగాయి. అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది. ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాని మోడీ హయాంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని చెబుతున్నారంటే సిగ్గుపడాల్సిన విషయం.
ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరిగా అంబానీ, అదానీలు పెరిగిపోతున్నారు. దేశంలో రూపాయి విలువ తగ్గించి, పేదరికం, నిరుద్యోగాలను పెంచిన విఫల ప్రధాని నరేంద్రమోడీ హయాంలో దేశం బ్రహ్మాండంగా ముందుకు పోతోందని అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలి. ప్రజలందరూ బూటకపు మాటలను గుర్తెరగాలని విజ్ఞప్తి చేస్తున్నా మన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *