మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రజలందరూ ఆ దిశగా దృష్టి సారించి యోగ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మచిలీపట్నం నగరంలోని గాంధీనగర్ లో గల ఏపీ యోగాసభ వారి ఉదయపు నడక మిత్రమండలి భవనంలో మంగళవారం తెల్లవారుజాముననే జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ యోగా శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి యోగా ర్యాలీ ప్రారంభించి సుమారు 70 మంది యోగా సభ్యులతో కలిసి
యోగా చేయండి – ఆరోగ్యం పొందండి
అని నినాదాలు చేస్తూ మచిలీపట్నం పట్టణ పురవీధుల్లో యోగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఊరేగింపుగా జడ్పీ కూడలిలోని వినాయకుడి గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ అధికారిక యోగా ర్యాలీ ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. అనంతరం అక్కడ నుంచి రెవెన్యూ, పోలీసు, రెడ్ క్రాస్, మునిసిపల్, ఆరోగ్య, ఆయుష్, సమాచార తదితర ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది , కృష్ణా విశ్వవిద్యాలయం, నోబుల్ కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు, చేద్దాం చేద్దాం యోగా చేద్దాం, సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే, యోగా చేద్దాం అందరి చేత చేయిద్దాం, అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ
సాయిబాబా గుడి వరకు ర్యాలీ గా వెళ్లారు.
కలెక్టర్ ప్రశంశలు…
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన స్వానుభవం వివరిస్తూ నిత్యం యోగా వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని, మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రజలంతా నిత్యం యోగా చేయాలని, ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేయాలన్నారు.
తాను నిత్యం గాంధీనగర్ లోని వాకర్స్ అసోసియేషన్ హాలులో యోగా చేస్తునానన్నారు. యోగా వలన తన విధి నిర్వహణలో అద్భుత ఫలితాలు* లభించాయన్నారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోయాయని, ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడి తగ్గిందన్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏవిధమైన టెన్షన్ లేదన్నారు. ఎపి యోగ సభ ఆధ్వర్యంలో మచిలీపట్నం లో 5 కేంద్రాలలో ఉచితంగా యోగ శిక్షణ ఇస్తున్నందుకు యోగాసభ గురువులను అభినందించారు.
నగరంలో చింతగుంటపాలెం, గాంధీ నగర్, శంకరమఠం గొడుగు పేట, రెడ్ క్రాస్ భవనాలలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావుతో పాటు ఏపీ యోగాసభ గురువులు చింతయ్య, రమేషు, శ్రీనివాసు పలువురు యోగ సాధకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News