Breaking News

జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ మాటే వేదం

-కూటమి ప్రభుత్వం రాష్ట్ర పురోగతి కోసం ఆలోచిస్తుంది
– రూ.10 లక్షల కోట్ల అప్పు పెట్టి వైసీపీ వెళ్లిపోయింది
-అనాలోచితంగా చేసిన పనుల వల్ల ప్రజా ధనం వృథా అయింది
-కూటమి ప్రభుత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలి
-4వ తేదీన ‘రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఏడాది’ కార్యక్రమం
-ఉదయం సంక్రాంతి ఉట్టిపడేలా, సాయంత్రం దీపావళి కాంతులు కనపడేలా కార్యక్రమాలు
-పిఠాపురంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించిన పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఏడాది’ పేరుతో ఈ నెల 4వ తేదీన జనసేన శ్రేణులంతా సంక్రాంతి – దీపావళి పండుగలు ఒకేసారి చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఉదయం వేళ రంగువల్లుల పోటీలు, అలాగే సంక్రాంతి పండుగ కళ వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని, సాయంత్రం దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి దీపావళి పండుగ వేడుకలను చేసుకుందామని, ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆదివారం నాదెండ్ల మనోహర్  పాల్గొన్నారు. పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికలను వన్ సైడ్ నిర్వహించుకోవడానికి కుట్రలు పన్నితే, దాన్ని జన సైనికులు, వీర మహిళలు ఎదుర్కొన్న తీరు ఓ గొప్ప స్ఫూర్తి పాఠం. అన్ని చోట్లా ఏకగ్రీవాలు చేయాలనే కుటిల ప్రయత్నాలను జన సైనికులు, వీర మహిళలు ఎదురొడ్డి నిలబడి అడ్డుకున్నారు. అది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  నేర్పిన తెగువ.. ఆయన నేర్పించిన ప్రజాస్వామ్య పరిరక్షణ పాఠం. విలువలతో కూడిన రాజకీయాలు, అందరికీ ఉపయోగపడే సేవ చేయాలనే లక్షణాలను జనసేన పార్టీ కార్యకర్తలకు బోధించిన గొప్ప నాయకుడు  పవన్ కళ్యాణ్.

కూటమి ప్రభుత్వంలో బాధ్యతగా ఉందాం
కూటమి ప్రభుత్వo అధికారంలోకి రాగానే పింఛను సొమ్మను రూ.4 వేలకు పెంచాం. అలాగే వికలాంగులకు రూ.6 వేలు, కదల్లేని పరిస్థితిలో ఉన్న వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సొమ్ములు ఇస్తున్నాం.  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎప్పుడూ పదవి గురించి కోరుకోలేదు. ఆయనకు ప్రజలంటే ప్రాణం. వారికి ఏదైనా చేయాలన్న సంకల్పం ఉన్నాయి. అదే స్ఫూర్తితో రాజకీయ బాటలో నడిచారు. ప్రజలు ఆశీర్వదించి పదవి ఇచ్చారు. పదవుల కోసం ఆయనెప్పుడూ రాజకీయాలు చేయలేదు. చేయబోరు. కూటమి ప్రభుత్వంలో నాయకులు అనవసర విషయాల పట్ల చర్చ తీసుకురాకండి. కూటమి ఎలా ముందుకు వెళ్లాలి..? మరింతగా ప్రజాదరణ చూరగొనాలి అనే దానిపై ఆలోచించండి. గత ప్రభుత్వంలో విధ్వంసం అయిన రాష్ట్ర పరిస్థితిని మరో 10, 15 సంవత్సరాలపాటు కూటమి ప్రభుత్వం చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. కొందరు రాజకీయ నిరుద్యోగులు ఎక్కువయ్యారు. వారికి సోషల్ మీడియాలో తప్ప మరో పని ఉండదు. ఏదో ఒక ట్వీట్, వీడియో పెట్టి దాన్ని వైరల్ చేసి, చిచ్చుపెట్టి ఆనంద పడుతుంటారు. అలాంటి వారితో, అలాంటి వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలి. మన అనైక్యత వారికి వరంగా మారకూడదు. మనం దీనిపై ఎప్పటికప్పుడు జాగురూకులై ఉండాల్సిన అవసరం ఉంది. 2020 జనవరిలోనే ఢిల్లీ వెళ్లిన సందర్భంగా బీజేపీ నాయకులతో జనసేనకు పొత్తు కుదిరింది. నాలుగు సంవత్సరాలు బీజేపీతో కలిసి ప్రయాణం చేసిన తర్వాత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమి ఏర్పాటు చేశాం.

కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ 
ఇప్పటం పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్  చాలా ధైర్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పారు. బీజేపీ నాయకులను సైతం ఢిల్లీ వెళ్లి ఒప్పించగలిగారు. కేంద్రం సహాయం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని అప్పట్లోనే గ్రహించి, బీజేపీ కచ్చితంగా కూటమిలో ఉండాలని భావించారు. కేంద్రం ఇప్పుడు అదే రీతిన సహకరిస్తుండటంతోనే పోలవరం ప్రాజెక్టు కోసం రూ. 15 వేల కోట్లు, అమరావతి కోసం నిధులు వచ్చాయి. పార్టీ కార్యకర్తలు కూడా పథకాలు మీద అవగాహన పెంచుకోవాలి. ఏ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుంటే మీ ప్రాంతాలు కూడా చాలా వేగంగా అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఒకే రోజు 13,324 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి, అక్కడ తీర్మానించిన పనులను పల్లె పండగ ద్వారా పూర్తి చేసిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన మా పిఠాపురం ఎమ్మెల్యే అని ఇక్కడున్న వారంతా గర్వంగా చెప్పుకోవాలి.
గత వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు పెట్టి వెళ్లిపోయింది. కనీసం రైతులకు ఇవ్వాల్సిన రూ.1674 కోట్లను బకాయి పెట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే వాటిని చెల్లించాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్, రబీ మాసాల్లో రైతులకు రూ.12,400 కోట్లు ధాన్యం కొనుగోళ్ల డబ్బులను 24 గంటల్లోనే అందించాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా వేలాది కోట్లతో రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ దే. పిఠాపురం నియోజకవర్గాన్ని ఓ మోడల్ నియోజకవర్గంగా, సమస్య రహిత నియోజకవర్గంగా తీర్దిదిద్దుతున్నారు. పిఠాపురంలో పారిశుద్ధ్యం, రోడ్ల సమస్య మీద దృష్టి సారించి జనసైనికులు, వీర మహిళలు ఓ ప్రత్యేక కార్యక్రమం చేయండి. ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలి.

రూ.1650 కోట్ల ప్రజా ధనం వృథా చేశారు
గత ప్రభుత్వం ఆలోచన లేకుండా, తన స్వార్థం కోసం జగన్ మోహన్ రెడ్డి గారు 9260 ఎండీయూ వాహనాలను తీసుకొచ్చారు. గతంలో 29 వేల రేషన్ దుకాణాలు ఉండేవి. వాటిని కాదని ఎండీయూ వాహనాలను తీసుకొచ్చి రూ.1650 కోట్ల ప్రజాధనం వృథా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ రేషన్ దుకాణాలను ప్రారంభించి, పారదర్శకంగా ప్రజా పంపిణీ చేసేలా చొరవ తీసుకుంది. నాణ్యత, సమయం విషయంలో రేషన్ దుకాణాలు పారదర్శకంగా పనిచేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 29,790 రేషన్ దుకాణాలు ప్రారంభించాం. కాకినాడ నియోజకవర్గంలోనే 1160 రేషన్ దుకాణాలు పారంభం అయ్యాయి. ఈ నెల 12వ నుంచి రాష్ట్రంలోని 41 వేల పాఠశాలలు, 4 వేల సంక్షేమ వసతి గృహాల్లో సన్న బియ్యంతో భోజనం పిల్లలకు అందిస్తున్నాం. పిల్లలకు సన్న బియ్యం అందించే రైతును పాఠశాలకు పిలిచి పిల్లల ముందు అభినందించే కార్యక్రమం చేస్తున్నాం.

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే నిలబడ్డాం
గతంలో అధికారంలో లేనపుడు జనసేన పార్టీ విస్తృతమైన కార్యక్రమాలు చేశాం. రోడ్ల సమస్యను ప్రపంచానికి తెలిసేలా గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం కాని, రాజమండ్రిలో రోడ్ల సమస్య మీద అంతే గట్టిగా స్పందించాం. పుట్టపర్తిలో  పవన్ కళ్యాణ్ శ్రమదానం చేశారు. మత్స్యకారుల సమస్యల గురించి మత్స్యకార భరోసా యాత్ర చేపట్టాం. మత్స్యకారుల బతుకులను ప్రభావితం చేసే జీవో నంబరు 117ను  పవన్ కళ్యాణ్  చించివేసి వారికి ధైర్యం ఇచ్చారు. అధికారంలోకి రాగానే మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయాన్ని చేపల వేట నిషేధ సమయంలో ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రజలకు అవసరం అయిన విషయంలో ముందుందాం. మనమంతా ఒకటే.  పవన్ కళ్యాణ్  మాటే వేదం. దీన్ని గుర్తుంచుకొని ఐక్యంగా ముందుకు వెళదాం.

పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ కి ప్రాణం: పిడుగు హరిప్రసాద్ , శాసన మండలి ప్రభుత్వ విప్
ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ‘‘పిఠాపురం నియోజక వర్గంలో ప్రతి కార్యకర్త వివరాలు, వారి కుటుంబ పరిస్థితి, వారి ఆర్థిక పరిస్థితి అన్ని తెలుసుకోవాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  తాపత్రయపడుతుంటారు. వారికి అండగా అన్నీ తానై నిలవాలని తపించే మనసు పవన్ కళ్యాణ్ ది. ఆయన వెన్నంటే నిలిచిన ఈ నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి పథంలో నడిపించే ప్రణాళిక ఉప ముఖ్యమంత్రి  వద్ద ఉంది. ఎలాంటి అరమరికలు లేకుండా, వేరే ఆలోచనలు లేకుండా పార్టీ కోసం పని చేద్దాం. కూటమిలో చిన్నచిన్న గొడవలు సృష్టించి ఆనంద పడేందుకు ప్రతిపక్షాలు పని చేస్తుంటాయి. దానిని అధిగమించి మన ఐక్యతను చాటాలి. త్వరలోనే పిఠాపురం నియోజకవర్గ కమిటీలు వస్తాయి. అధ్యక్షులు పవన్ కళ్యాణ్  త్వరలోనే అన్ని పూర్తి స్థాయి కమిటీలు వేయాలని భావిస్తున్నారు. దీంతో పిఠాపురం కమిటీ కూడా వస్తుంది. కేంద్ర కార్యాలయ భవనం కూడా పూర్తవుతున్న తరుణంలో మొదటి సమావేశం పిఠాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఉంటుంద’’న్నారు.
ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే  పంతం నానాజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు  తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్ చల్లా లక్ష్మీ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *