

-అన్ని అంశాల్లో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయాలి
-విద్యుత్తు రంగ పనితీరులో ఏపీ నంబర్ 1గా నిలవాలి
-అదే లక్ష్యంతో పనిచేయాలి
-వినియోగదారులే కేంద్రంగా పనిచేయాలి
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలివే..
-చౌక విద్యుత్తులో ఏపీ విద్యుత్తు సంస్థలు జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి
-గడిచిన రెండేళ్లలో రూ.2342 కోట్లు ఆదా చేశాయి
-రాబోయే 30 ఏళ్ల వరకు రైతులకు ఉచిత విద్యుత్తు అందించేందుకు చర్యలు
-33.24 గిగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటును పరిశీలిస్తున్న ప్రభుత్వం
-ప్రజాప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి
-విద్యుత్తు రంగానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్న సీఎం, మంత్రి
-స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్తును కొనుగోలు చేయడం ద్వారా గడిచిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సంస్థలు రూ.2342 కోట్లు ఆదా చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలూ అందుకున్నాయి.ఇదే ఉత్సాహం తో , ఇదే స్ఫూర్తి తో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ అన్ని అంశాల్లో దేశానికే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి యావత్తు విద్యుత్ అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాంత్ ఆదివారం విద్యుత్తు సౌధలో ట్రాన్స్ కో జె ఎం డీ కె.వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు కె.ప్రవీణ్ కుమార్, కె.ముత్తుపాండియన్, జెన్కో డైరెక్టర్ , థర్మల్ , జీ చంద్రశేఖర రాజు , డైరెక్టర్ ఫైనాన్స్ , బీ వెంకటేశులు రెడ్డి సీఈలు, ఉద్యోగుల సమక్షం లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు రంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయన్నారు. అవి.. అన్ని అంశాల్లో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయడం, వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా ఈ రంగాన్ని తీర్చిదిద్దడం అని చెప్పారు.
చౌక విద్యుత్ కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని శ్రీకాంత్ తెలిపారు. ఏపీ విద్యుత్తు సంస్థలను కేంద్ర విద్యుత్తు శాఖ ప్రశంసించిందన్నారు. స్వల్ప కాలిక మార్కెట్, ద్వైపాక్షిక కొనుగోళ్లతో 2019-20, 2020-21లో రూ.181.58, 803.87 కోట్లు ఆదా చేశామని, అలాగే 625 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్తును సరెండర్ చేయడం ద్వారా రూ.1007 కోట్లు, వార్షిక పీవోసీ ఛార్జీలను తగ్గించడం ద్వారా రూ.350 కోట్లు పొదుపు చేసినట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా రైతులకు పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్తును అందజేస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. ఉచిత విద్యుత్తు పథకాన్ని నిరంతరాయంగా, మరో 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు గాను ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్తు కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 18 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటి పూట ఉచిత విద్యుత్తు అందించేందుకు రూ.1700 కోట్లతో వ్యవసాయ ఫీడర్ల అప్ గ్రెడేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తును అందించేందుకు గాను వివిధ జిల్లాల్లో 33.24 గిగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని శ్రీకాంత్ చెప్పారు. అలాగే అల్ట్రా మెగా పునరుత్పాదక ఇంధన పార్కులను ఏర్పాటు చేసేందుకు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.45 లక్షల ఎకరాల భూములను గుర్తించినట్లు తెలిపారు.
వినియోగదారులకు అంతరాయాల్లేకుండా నాణ్యమైన కరెంటును అందించేందుకు విద్యుత్తు సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఫలితంగా 2019-20లో మూడు లక్షలుగా ఉన్న అంతరాయాలను 2021-22 నాటికి 1.77 లక్షలకు తగ్గించగలిగినట్లు శ్రీకాంత్ వివరించారు. అదేసమయంలో యూనిట్ సగటు సర్వీసు ఖర్చు కూడా రూ.7.23 నుంచి రూ.7.18కి తగ్గినట్లు తెలిపారు.
వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే పరమావధిగా పనిచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని శ్రీకాంత్ అన్నారు. విద్యుత్తు రంగంలో ఏం చేసినా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే చేయాలని ముఖ్యమంత్రి విద్యుత్తు సంస్థలను ఆదేశించినట్లు తెలిపారు. విద్యుత్తు సంస్థలు ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తున్నాయన్నారు. నవరత్నాలు కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ఇంధన భద్రత, భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు గాను ఇంధన శాఖ అన్ని రంగాల్లో ఇంధన సంరక్షణ, పొదుపు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీకాంత్ చెప్పారు. ఎంఎస్ఎంఈల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో జాతీయ స్థాయి గుర్తింపు పొందినట్లు తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గో ఎలక్ట్రిక్ ప్రచారాన్ని చేపట్టినట్లు శ్రీకాంత్ చెప్పారు. నెడ్ క్యాప్ రాష్ట్రంలో ఇప్పటికే 109 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిందన్నారు. మరో 400 ఛార్జర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
విద్యుత్తు సంస్థలు ఇప్పటి వరకు 44608 మంది ఉద్యోగులకు కొవిడ్ టీకాలు వేయించాయని, మరో 18,806 మందికి త్వరలోనే వ్యాక్సిన్లు వేయించనున్నాయని శ్రీకాంత్ వివరించారు. విద్యుత్తు రంగానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో రూ.28 వేల కోట్లు కేటాయించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు.
‘మిమ్మల్ని మీరు కనుగొనడానికి ఉత్తమ మార్గం ఇతరులకు సేవ చేయడమే.. ఇతరుల సేవలో జీవించే జీవితం మాత్రమే విలువైనది’ అని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పిన మాటలు మనకు స్ఫూర్తి కావాలంటూ శ్రీకాంత్ తన ప్రసంగాన్ని ముగించారు.
Prajavartha Online Telugu News