-వెలిగొండ పూర్తి చేసి ప్రజల నీటి కష్టాలు తీర్చుతాం
-ఏడాదిలోనే సూపర్ సిక్స్ – సూపర్ హిట్
-మంత్రి గొట్టిపాటి రవి కుమార్
మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల నీటి కష్టాలను తీర్చుతామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా నేతలంతా ఐక్యంగా ఉంటూ జిల్లాకు అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. సోమవారం నాడు మార్కాపురంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. మార్కెటింగ్ యార్డ్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఎంతమంది పిల్లలున్నా ప్రతి తల్లికి వందనం పథకం కింద ₹10 వేల చొప్పున ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 65 లక్షల పింఛన్లు ఇస్తోందని, ఇటీవల మరో 1.10 లక్షల మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరు చేశామని చెప్పారు. వైసీపీ పాలనలో ఒక్క స్పౌజ్ పింఛను ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అర్హత లేని వారికి పింఛన్లు అందుతున్నాయన్న ఫిర్యాదుల కారణంగా ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టగా, దానిపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పం అని స్పష్టం చేశారు.
ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నామని, త్వరలోనే విద్యుత్ శాఖలో కూడా ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించారు. వైసీపీ పాలనలో విద్యుత్ శాఖ అస్తవ్యస్తమైందని, దానిపై రూ. 80 వేల కోట్ల భారాన్ని మోపారని ఆయన ఆరోపించారు. మూడు రాజధానుల ముసుగులో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డేనని మంత్రి మండిపడ్డారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాన్ని విలువలేనిదిగా మార్చారని, దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపిన ఘనుడు జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. పేదలను దోచేది వైసీపీ ప్రభుత్వం అయితే, పేదలకు సాయం చేసేది కూటమి ప్రభుత్వం అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News