Breaking News

“తెలుగు భాష- స్వర్ణ భారత్- తిక్కన” పురస్కారానికి 5 లక్షల రూపాయల మూల నిధి

-ప్రకటించిన భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
-ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం
-అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం చొరవ చూపాలని సూచన

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు భాషపై తన మమకారాన్ని మరోసారి చాటుకున్నారు.  నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని శనివారం సందర్శించిన సందర్భంగా “తెలుగు భాష- స్వర్ణ భారత్- తిక్కన” పురస్కారానికి తన వ్యక్తిగత పెన్షన్ నుంచి 5 లక్షల రూపాయలు మూల నిధిగా ప్రకటించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రతి ఏటా ఎంపిక చేసే తెలుగు భాష సేవకులకు ఈ మూల నిధి నుంచి పురస్కారం అందజేస్తారు.
నెల్లూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఈ అధ్యయన కేంద్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉందని అన్నారు. ‘‘ భారత ప్రభుత్వం తలపెట్టిన ప్రణాళికల్లో ప్రాచీన భారతీయ భాషల పరిరక్షణ, పోషణ, అభ్యున్నతి, ప్రాచుర్యం అత్యంత ప్రాధాన్యత గల అంశాలు. అందులో భాగంగానే వివిధ భాషల అధ్యయన కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏ భాష అధ్యయన కేంద్రం అయినా ఆ భాష మాట్లాడే గడ్డపై ఉంటే న్యాయం జరుగుతుంది. అందుకే తిక్కన సోమయాజి నడవడిన నేల మీద ఈ విశిష్ట కేంద్రం ఏర్పాటు చేయడం సరైనది భావించి నా వంతు ప్రయత్నం చేశాను. తెలుగు భాషాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అద్దె లేకుండా తాత్కాలికంగా నైనా సరే ఉచితంగా ఈ కార్యాలయాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన స్వర్ణభారత్ ట్రస్ట్ ట్రస్టీ దీపా వెంకట్ కు అభినందనలు.’’ అని అన్నారు.
ఆంధ్రుడు ఆరంభ సూర్యుడు అనే అపవాదు తప్పని ఈ తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మనం నిరూపించాలని  వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ దూరదృష్టితో, మన చొరవతో ఈ విశిష్ట కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషమే. అయితే ఇంతటితో మన బాధ్యత ముగిసిపోలేదు. ఎందుకంటే ఈ కేంద్రం మన రాష్ట్రంలో ఉంది, మన భాష ప్రాచుర్యం కోసం ఏర్పడింది. అందుకే దీన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వం పైన కూడా ఆధారపడి ఉంది. కేవలం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని సరిపెట్టుకోకూడదు. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని నేను కోరుతున్నాను. తెలుగు గడ్డపై ఉన్న ఈ కేంద్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకు రావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యామంత్రి చొరవ తీసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉంది.’’ అని చెప్పారు.
తెలుగు భాషలో విస్తృతమైన పద సంపద ఉందని, దాన్ని కాపాడుకోవాలని  వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ‘‘తెలుగుభాషలో పద సంపదకు కొదవలేదు. ఎన్నో పదాలు కనుమరుగయ్యాయి. కనుమరుగవుతున్నాయి. వాటన్నింటినీ సేకరించి, అర్థాలను విడమరిచి ప్రజలందరికీ చేరువ చేస్తే ఆధునిక భావనలకు దగ్గరగా ఉండే ఎన్నో పదాలు మన భాషలోనే దొరుకుతాయి. ఆంగ్లభాషపై ఆధార పడాల్సిన అవసరం లేదు. నిఘంటు నిర్మాణ శాస్త్రం, చరిత్ర, సమాజ శాస్త్రం, మానవ నిర్మాణ శాస్త్రం, పురావస్తు సాక్ష్యాలు, లిఖితప్రతులు, ప్రాచీన లిపి శాస్త్రం, కళ, వాస్తుకళ, ప్రవాసాంధ్ర గాథలపై ప్రత్యేక దృష్టి సారించి ఆధునిక సాంకేతిక పదాలకు సమానమైన సహజ తెలుగు పదాలను గుర్తించి వాడుకలోకి తేవాలి. ప్రజలే, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు చాలా పదాలను సహజ రీతిలో సృష్టిస్తారు. వాటిని ఒడిసి పట్టుకోవాలి. తెలుగులో ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాండలికంలో ఒక్కో విశిష్టత ఉంది. ఆయా మాండలికాల్లో, ఆయా ప్రాంతాల్లో ఎంతో పద సపంద దాగి ఉంది. ఆ పద సంపదనంతటినీ ఒక్క చోట చేర్చి అందరికీ అందుబాటులోకి తెస్తే కొత్తగా పదాలను సృష్టించే అవసరమూ తగ్గుతుంది. ఈ పనిని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం చేపట్టాలి.’’ అని చెప్పారు. మన భాషా సాహిత్య, సంస్కృతీ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక భాష ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ ఉన్న వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా క్రమంగా తెరమరుగవుతాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాచీన తెలుగు ప్రతులను, గ్రంధాలను యుద్దప్రాతిపదికన డిజిటలీకరించాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు  మాడభూషి సంపత్ కుమార్, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీనివాసరావు, దూరదర్శన్ పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌  రేవూరి అనంత పద్మనాభరావుగారు తదితరులు పాల్గొన్నారు. మాడభూషి సంపత్ కుమార్ రచించిన కృష్ణదేవరాయల కీర్తి వ్యాస సంకలనం పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన వెంకయ్యనాయుడు కి అంకితమిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *