మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య బంధం పటిష్టంగా ఉండాలని, సంసార జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయని సర్దుకు పోవడమే సంసార రహస్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
గురువారం ఆయన ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి పేర్ని నాని హడావిడిగా విజయవాడ బయలుదేరారు. ఆ ప్రయాణ సమయంలో సైతం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. జియో జూమ్ మీట్ ద్వారా తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎల్ ఈ డి బిగ్ స్క్రీన్ టీవీ ద్వారా అక్కడకు వచ్చిన పలువురు ప్రజలను ముఖాముఖిగా వీక్షిస్తూ వారి సమస్యల గూర్చి ఎంతో ఓపిగ్గా విన్నారు.
తొలుత గిలకలదిండికి చెందిన ఒక మహిళ మంత్రి వద్ద తన సమస్యను చెప్పుకొంది. తన కుమార్తె ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్నప్పుడు పల్లె తుమ్మలపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి తన బిడ్డను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడని పోలీసుల సహాయంతో వారిని వెతికి పట్టుకొని ఇరువురికి పెళ్లి చేశానని మొదటి ఆడపిల్ల పుట్టేవరకు బాగానే ఉన్నాడని రెండవ కాన్పులో మళ్ళీ ఆడపిల్ల పుట్టిన తర్వాత అల్లుడు ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఇంటికి రాకపోవడం,తన కుమార్తెను విపరీతంగా అనుమానిస్తూ,నిత్యం వేధిస్తున్నాడని మంత్రి వద్ద వాపోయింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని మచిలీపట్నం మాజీ జడ్పిటీసీ లంకె వెంకటేశ్వరరావు ( ఎల్వీయార్ ) కు ఫోన్ చేసి ఈ విషయమై ఆరా తీసి బాధితురాలికి న్యాయం చేయాలనీ సూచించారు.
రెండు దశాబ్దాలుగా ఉద్యోగం కోసం సుదీర్ఘ కాలం నిరీక్షిస్తున్న తమకు పోస్టింగ్లు ఇవ్వలేదని, ఇటీవల 2008 అభ్యర్థులకు టైమ్ స్కేలు మీద ఉద్యోగాలు ఇచ్చారని వారికి ఇచ్చనట్లు తమకు సైతం డి.ఎస్.సి. 1998 అభ్యర్థులకు 4534 మందికి ఉద్యోగాలు ఇవ్వలసిందిగా అభ్యర్ధిస్తున్నట్లు 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ సంఘ నాయకుడు వంకా వెంకటేశ్వరరావు మంత్రిని అభ్యర్థించారు. అలాగే 1998 లో ఆపరేషన్ బ్లాక్ బోర్డు (ఓ.బి.బి.) పోస్టులను ఇవ్వాలని తద్వారా 23 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న తమకు న్యాయం చేయాల్సిందిగా మంత్రిని ఆయన వేడుకొన్నారు.
స్థానిక పాత రామన్నపేటకు చెందిన గుడివాడ వెంకటేశ్వర్రావు మంత్రికి తన సమస్య చెప్పుకొన్నారు. కోవిడ్ తర్వాత తనకు మ్యూకోమైసిన్ సోకిందని చికిత్స కొసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే , 2 లక్షల 10 వేల రూపాయల బిల్లు ఇచ్చారని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఏమైనా ఆర్ధిక సహాయం అందేలా చూడాలని మంత్రిని అభ్యర్ధించారు.
స్థానిక ఉల్లింగిపాలెంకు చెందిన పీత లక్ష్మీ ప్రసాద్ మంత్రికి తన కష్టాన్ని చెప్పుకొన్నారు. గతంలో ఎప్పుడో అర్బన్ బ్యాంకులో రుణం తీసుకున్నానని వడ్డీతో కలిపి ఎక్కువ మొత్తంలో రుణం పెరిగిపోయిందని తాను అంత మొత్తం బ్యాంకుకు చెల్లించలేనని తాను చెల్లించే డబ్బు తీసుకోని ఆ అప్పు మాఫీ చేసేలాగున సహాయం చేయాలనీ మంత్రిని కోరారు.
మచిలీపట్నం మండలం పాతేరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ పెట్ల కోట నారాయణ మంత్రికి తన సమస్య చెప్పారు. తానూ గతంలో కృష్ణా విశ్వ విద్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగం చేసెనని, మరలా ఆ ఉద్యోగం పొందేలా సహాయం చేయాలనీ మంత్రి పేర్ని నానిని అభ్యర్ధించారు.
Prajavartha Online Telugu News