విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ జలాది చంద్రనంద్ గురువారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లు 42% అమలుకు రాజ్యాంగ సవరణ అవసరమని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టిడిపి మరియు జనసేన పార్టీ ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రా పొలిటికల్ ఫ్రంట్ ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు, ప్రత్యేక ప్యాకేజీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని వెంటనే ఆ నిధులు, ప్యాకేజీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.రాష్ట్ర ప్రజా సంక్షేమ దిశగా ప్రతి రంగంలో సంస్కరణలు తీసుకురావాలని రైతులకు లాభదాయక ధరలు, పంటల రక్షణ, రుణమాఫీ, మార్కెట్ సంస్కరణలపై తక్షణ చర్యలు తీసుకోవాలి.యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల స్థాపన, నిరుద్యోగ భృతి వ్యవస్థ బలోపేతం అందరికీ ఉచిత ఆరోగ్యసేవలు మరియు ఉచిత విద్యా వ్యవస్థ,మహిళల సాధికారత, భద్రత, ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం న్యాయపరమైన మార్పులు రావాలన్నారు. రాజకీయ నాయకులు డబ్బు పెట్టి గెలిచిన తర్వాత తమ సీట్లకే పరిమితం కాకుండా, గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజా సేవ చేయాలనీ, జీతం తీసుకున్నందుకు ప్రజలకు సేవ చేయడం నాయకుల ప్రాథమిక బాధ్యత.ప్రజా హక్కులు, పారదర్శక పాలన, సామాజిక న్యాయం కోసం ఆంధ్రా పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర వహిస్తుందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవగాహన, ఉద్యమ కార్యక్రమాలు చేపట్టి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రా పొలిటికల్ ఫ్రంట్ తరఫున అన్ని పార్టీల ప్రతినిధులు తమ ప్రాంతాల్లో పోటీ చేయడానికి క్యాబినెట్ రూపకల్పన చేస్తామన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 79 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన కొన్ని వర్గాలకే పరిమితమైందని, ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు, కులాలకు జనాభా ప్రాతిపాదికన రాజ్యాధికారంలో సముచిత ప్రాతినిధ్యం దిశగా ఉద్యమం ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వి.జి.ఆర్. నారగోని, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్: సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి, జైబాబు, కాపు నాడు అధ్యక్షులు గిద్దా శ్రీనివాస్ నాయుడు, బేడ బుడగ జంగం నాయకుడు వనం నాగేశ్వరరావు, కాపు సంఘం నేత శ్రీనివాస్, సామాజిక ప్రజా కార్యకర్తలు: అంజినిరెడ్డి, దుర్గా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News