అన్నదాత అభివృద్ధికి పంచసూత్రాలు

-నీటి భద్రత, ప్రకృతి సేద్యం, టెక్నాలజీ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సహాయం అనే పంచ సూత్రాలతో రైతే రాజుగా ఉండే రాష్ట్రాన్ని నిర్మిస్తాం
-ప్ర‌తి రైతు శాస్త్ర‌వేత్త అవ్వాలి
-ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై మ‌క్కువ పెంచుకోవాలి
-రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా…సీఎం చంద్ర‌బాబు రైతుపక్షం విడవలేదు
-సీఎం చంద్రబాబు విజన్ వల్లే పది ఏళ్లుగా కృష్ణా డెల్టాకు నీటి సమస్య రాలేదు
-రైత‌న్న మీకోసం కార్య్రక్ర‌మం ప్రారంభోత్స‌వంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

ఘంట‌శాల‌/కృష్ణాజిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు కూట‌మి ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతోందని వ్య‌వ‌శాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సోమ‌వారం కృష్ణ జిల్లా, ఆవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని ఘంట‌శాల గ్రామంలో రైత‌న్న మీకోసం కార్య‌క్ర‌మాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వర్గ ఎమ్మెల్యే డా.మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ తో క‌ల‌సి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఘంట‌శాల గ్రామంలో రైతుల‌కు పంచ‌సూత్ర ప్ర‌ణాళిక ఉద్దేశాన్ని, ఉప‌యోగాల‌ను మంత్రి అచ్చెన్నాయుడు వివ‌రించారు. ముఖ్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టామన్నారు. వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకురావడం ద్వారా రైతుల సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 29వరకూ “రైతన్నా మీకోసం” పేరుతో కార్యక్రమాలు చేపడ‌తున్నామ‌ని, డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహిస్తామ‌ని తెలిపారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రైతు నిలబడేలా, వ్యవసాయం కొనసాగించేలా ఒక వ్యవస్థ ఉండాలి. రైతుకి భరోసా ఇవ్వగల శాశ్వత పరిష్కారాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువస్తున్నారు. ఆ నిర్ణయమే ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం అని పేర్కొన్నారు.

ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందాలి

రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందాలని ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండటంతో, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. రైతు బలపడితేనే గ్రామం బలపడుతుంది. గ్రామం బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది. అందుకే ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని తెలిపారు. రైతు ఆదాయం పెంపు, ఇన్‌పుట్ వ్యయాల తగ్గింపు, పంటలకు హామీ ధర, ప్రకృతి విపత్తుల్లో రక్షణ, మార్కెట్ స్థిరీకరణ, శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అందుబాటు లోన్లు, పంట బీమా, నీటి వనరుల మెరుగుదల, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, రైతు సేవా కేంద్రాల బలపరచడం వంటి చర్యలు రైతు కుటుంబాల అభివృద్ధి వైపు స్పష్టమైన అడుగులని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు స్వయం సమృద్ధి సాధించే పరిస్థితులను క్రమబద్ధంగా సృష్టిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

పంచసూత్రాల ప్రచారం ప్రతి రైతు ఇంటికి

పంచసూత్రాలను ప్రతి రైతు ఇంటికి వెళ్లి, కనీసం 20 నిమిషాల పాటు వివరించేందుకు పెద్దస్థాయి కార్యక్రమం చేపట్టామని మంత్రి వెల్ల‌డించారు. ఈ పంచసూత్రాలు ఏమిటి? రైతుకి ఎలా మేలు జరుగుతుంది? భవిష్యత్తులో ఎలా స్థిర ఆదాయం వస్తుంది? ఏ ఇబ్బందులు లేకుండా వ్యవసాయం ఎలా ముందుకు సాగుతుంది? అనే విషయాలు ప్రతి రైతుకు స్పష్టంగా చెప్పడం మా లక్ష్యమ‌ని తెలిపారు. నీటి పారుదల, రైతు అభివృద్ధికి మొదటి అస్త్రం అని, వ్యవసాయం చేయాలంటే ముందుగా నీరు అవసరం. నీరు లేకపోతే రైతు కష్టమే. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నార‌ని వివరించారు. నంద‌మూరి తార‌క రామారావు, సీఎం చంద్రబాబు ల హ‌యాంలో నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, వారి కృషి వ‌ల‌నే అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మిగిలినవన్నీ వేగంగా సాగుతున్నాయని, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. పంటలు పండించేటప్పుడు డిమాండ్ ఆలోచించకుండా పక్క రైతును చూసి పంట పెట్టడం, గత సంవత్సరం ధర వచ్చిన పంటను మళ్లీ పెట్టడం వల్ల నష్టం వస్తోందని మంత్రి చెప్పారు. ప్రజల ఆహార అలవాట్లు పూర్తిగా మారాయని, రాగులు, సజ్జలు, జొన్నలు మళ్లీ డిమాండ్ పెరుగుతున్న ఆరోగ్యకర ధాన్యాలని, ఈ మార్పును రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతన్న మీకోసం కార్యక్రమాలను రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుండి నడిపించాలి, ప్రతి రైతు సేవా కేంద్రంలో కార్యాచరణ ప్రణాళిక అమలుచేయాలని మంత్రి ఆదేశించారు.

యాంత్రికరణ అగ్రిటెక్ రైతు భవిష్యత్ ఆయుధం

వ్యవసాయంలో కూలీల ఖర్చులు పెరుగుతున్నాయని, అందుకే యాంత్రికరణ తప్పనిసరి అని మంత్రి అన్నారు.
ఒకప్పుడు ట్రాక్టర్ కనిపించినా ఆశ్చర్యపోయేవాళ్లం, ఇప్పుడు ప్రతి గ్రామంలో యాంత్రికరణే ఆధారం, కోత నుండి మోత వరకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతు సేవ కేంద్రాల‌లో అన్ని యాంత్రికరణ ప‌రికరాలు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, రైతులు దీనిని వినియోగిస్తేనే లాభాలు ఎక్కువగా వస్తాయని అన్నారు. డ్రోన్ల ద్వారా మందు పిచికారీ చేయడమే కాకుండా, భవిష్యత్తులో డ్రోన్ ద్వారా ఏ ఎకరాలో ఏ వ్యాధి వచ్చిందో గుర్తించి, అదే ప్రాంతంలో అవసరమైన మందును మాత్రమే పిచికారీ చేసేలా శాస్త్ర‌వేత్త‌లు కృషిచేస్తున్నార‌ని, ఇది రైతు ఖర్చులు తగ్గించి, దిగుబడిని పెంచే విధానం అని అన్నారు. పంట పండిస్తే సరిపోదు. స్థానికంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉంటేనే రైతుకి అసలు లాభం వస్తుందని మంత్రి చెప్పారు.

రాజకీయ దురుద్దేశంతోనే జ‌గ‌న్ విమర్శలు

రైతన్న మీకోసం కార్యక్రమం రైతులను రోడ్డు మీద ప‌డేస్తుంది అని పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ అనడం సిగ్గుచేటని మంత్రి మండిప‌డ్డారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వ్యవసాయాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి ఈరోజు కూట‌మి ప్ర‌భుత్వంపై మాట్లాడటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని రంగాల‌ను ఛిన్నాభిన్నం చేసిన జ‌గ‌న్ అభివృద్ధి గురించి ప్ర‌శ్నించ‌డం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టు ఉంద‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా రైతుపై భారం మోపలేదని, 18 మాసాల్లో రైతు పక్షాన అనేక కార్యక్రమాలు చేప‌ట్టినా కూడా జ‌గ‌న్ కు క‌ళ్లు క‌న‌ప‌డ‌టం లేదా అని ప్ర‌శ్నించారు. అధిక దిగుబడులు వచ్చినా ధరలు రాక రైతులకి జరిగిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అండగా నిలిచిందని, బడ్జెట్‌లో 300 కోట్లు పెట్టినా, అవసరాన్ని బట్టి దాదాపు 1000 కోట్లు ఖర్చు చేసి రైతు పంటలు కొనుగోలు చేసామన్న విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తుపెట్టుకోవాల‌ని అన్నారు. వ్య‌వ‌సాయ శాఖ అభివృద్ధిపై జ‌గ‌న్ ఓపెన్ డిబేట్ కు రావాల‌ని, లేదా అసెంబ్లీకి వ‌స్తే చ‌ర్చించుకుందామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు స‌వాల్ విసిరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే డా. మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్, వ్య‌వ‌సాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్ర‌ట‌ర్ బీ.రాజ‌శేఖ‌ర్ (ఎక్స్ ఆఫీషియో), వ్య‌వ‌సాయ శాఖ క‌మీష‌నర్ మంజీర్ జిలానీ సామూన్, కృష్ణా జిల్లా జేసీ ఎం. న‌వీన్, ఆర్టీస్ చైర్మ‌న్ కొన‌క‌ళ్ళ నారాయ‌ణ‌, ఆంగ్రూ ప్ర‌తినిధులు డా. శివ‌న్నారాయ‌ణ‌, డా. దుర్గా ప్ర‌సాద్, విజ్ఞాన్ కృషి కేంద్ర సీనియ‌ర్ సైంటిస్ట్ డా.డి. సుధారాణి, ఘంట‌శాల గ్రామ‌స్తులు,కూట‌మి ప్ర‌భుత్వ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *