– జిల్లాలో వ్యాప్తి లేదు – సకాలంలో గుర్తిస్తే పూర్తిగా నయంఅవుతుంది
– జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కే వెంకటేశ్వర రావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“స్క్రబ్ టైఫస్” పై ప్రజల్లో అపోహలు మరియు అనవసర భయాందోళనలు ఏర్పడకుండా ఉండేందుకు వాస్తవ పరిస్థితిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున స్పష్టీకరణ ఇవ్వడం జరిగిందని డా. కె. వెంకటేశ్వర రావు తెలియ చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో ప్రచురితం అవుతున్న వార్తలు నేపథ్యంలో ప్రజలకి అవగాహన కల్పించడం కోసం సంబంధిత వివరాలు తెలియ చేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు (3) స్క్రబ్ టైఫస్ కేసులు మాత్రమే గుర్తించబడ్డాయని, అవి కూడా సాధారణ ఆరోగ్య పరీక్షలలో (Routine Screening) భాగంగా నిర్ధారణ అయినవేనని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కె. వెంకటేశ్వర రావు తెలియ చేశారు. జిల్లాలో ఎక్కడా స్క్రబ్ టైఫస్ వ్యాప్తి (Outbreak) పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. స్క్రబ్ టైఫస్ అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధి కాదని, ఇది ఒక జూనోటిక్ వ్యాధి కాగా ప్రధానంగా పొదలు, గడ్డి ప్రాంతాల్లో నివసించే నల్లి లార్వా (చిగ్గర్ మైట్స్) కాటు ద్వారా మాత్రమే మనుషులకు సంక్రమిస్తుందని తెలిపారు. సాధారణ స్పర్శ, దగ్గు, తుమ్ము, మాట్లాడటం ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని డా. కె. వెంకటేశ్వర రావు వివరించారు. ఈ నేపథ్యంలో, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి, ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా పలు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ ద్వారా గ్రామాలు, కాలనీల్లో పరిసరాల పరిశుభ్రత, ఘన మరియు సేంద్రియ వ్యర్థాల సక్రమ నిర్వహణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా పొలాలు, పొదలు, గడ్డి ప్రాంతాల్లో బుష్ క్లియరెన్స్, ఫీల్డ్ శానిటేషన్ చర్యలు చేపట్టి ఎలుకల నివాస ప్రాంతాల నిర్మూలన జరుగుతోందని, పశుసంవర్ధక శాఖ ద్వారా పశువుల షెడ్లు, గోదాముల్లో పరిశుభ్రతతో పాటు ఎలుకల నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నట్లు డా. కె. వెంకటేశ్వర రావు తెలియ చేశారు. గుర్తించబడిన మూడు స్క్రబ్ టైఫస్ కేసులూ ప్రస్తుతం స్థిరమైన ఆరోగ్య పరిస్థితిలో ఉన్నాయని, సకాలంలో చికిత్స అందడంతో వారు వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు. స్క్రబ్ టైఫస్‌ను తొలిదశలో గుర్తిస్తే చికిత్స చాలా సులభమై పూర్తిగా నయం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా భయపడకుండా, ముఖ్యంగా ఐదు రోజులకు మించి జ్వరం కొనసాగితే లేదా శరీర నొప్పులు, తలనొప్పి, చర్మంపై నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) లేదా ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. జిల్లాలో పరిస్థితిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు వదంతులు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కె. వెంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News