-విద్యుత్ చార్జీలు పెంచమన్న ఎన్నికల హామీ అమలు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల హామీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రజలపై రూ.4,498 కోట్ల విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పించారని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. 2019- 24 మధ్యకాలంలో ట్రూ అప్ చార్జీలు రూ.4498 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సి కూటమి ప్రభుత్వానికి లేఖ రాయగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ భారాన్ని ప్రజలపై వేయొద్దని, ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించటం ప్రజలకు మేలు చేసే విషయంగా పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేపడుతున్న విద్యుత్ సంస్కరణల ఫలితంగా ఏపీఈఆర్సి ఏర్పాటు అయిన 1999 నుండి తొలిసారి ట్రూ డౌన్ చార్జీలు నమోదు అవుతున్నాయన్నారు. ట్రూ డౌన్ అమలు ద్వారా తమ ప్రభుత్వం విద్యుత్ చార్జీల్లో యూనిట్కు 13 పైసలు తగ్గించిందని తెలియజేశారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని స్పష్టమైన హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వేలకోట్ల ట్రూ అప్ ద్వారాన్ని ప్రజలపై పడకుండా చూడటం చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణస్వీకారం రోజున ప్రగల్బాలు పలికిన జగన్ మోహన్ రెడ్డి తన అస్తవ్యస్త విధానాల ద్వారా 5ఏళ్ళ పాలనలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ. 32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు. 2019లో మిగులు విద్యుత్ తో ఉన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో విద్యుత్ కోతలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. కమిషన్లకు కక్కుర్తి పడి ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేసి రూ. 1.29 కోట్ల అప్పులు మిగిల్చారని విమర్శల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ కు రూ. 3.50 చొప్పున వసూలు చేయగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకొని యూనిట్కు రూ. 1.50 తగ్గించి ఆక్వా రైతులకు ఊరట కల్పించారని యార్లగడ్డ గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రూ. 5.19 లకు యూనిట్ విద్యుత్ ను కొనుగోలు చేయగా తమ ప్రభుత్వం రూ.4.70 కొనుగోలు చేస్తుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెన్యువబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యమిస్తూ సోలార్, పవన విద్యుత్ ఏర్పాటే లక్ష్యం గా ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. సోలార్ పవర్ ను ప్రోత్సహించేందుకు ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాప్ లు అందించడంతోపాటు బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రూ. 20 వేలు కూటమి ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే యార్లగడ్డ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ కోతల నుండి ప్రజలను విముక్తి కల్పించడమే కాకుండా విద్యుత్ చార్జీల భారం కూడా పడకుండా తప్పించి రాష్ట్ర ప్రజలకు ఆపద్బాంధవుడిగా మారారని ప్రశంసించారు. ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ప్రజలందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా యార్లగడ్డ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News