టూరిజం ప్రాంతీయ సంచాలకులు గా మూర్తి బాధ్యతలు స్వీకరణ

-ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి విస్తృత అవకాశాలు
-2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి
-యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి
-మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్‌గా మరియు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.వి.వి.ఎస్. మూర్తి ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పర్యాటక రంగం అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని సమగ్రంగా గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సహజసిద్ధమైన ప్రకృతి వనరులు, నదీ తీర ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సాంస్కృతిక వారసత్వ సంపదను సమర్థవంతంగా వినియోగిస్తే ఈ ప్రాంతం పర్యాటక హబ్‌గా ఎదగగలదని పేర్కొన్నారు.
పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. ముఖ్యంగా హోటల్స్, హోమ్‌స్టేలు, టూరిజం గైడ్స్, బోటింగ్, ట్రాన్స్‌పోర్ట్, హ్యాండిక్రాఫ్ట్స్ వంటి అనుబంధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిరుద్యోగ యువతకు పర్యాటక అనుబంధంగా ఉన్న రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చి పర్యాటక రంగానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు.

2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతంలో మరింత వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మౌలిక వసతులు, రహదారులు, వసతి సదుపాయాలు, శుభ్రత, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఎన్.వి.వి.ఎస్. మూర్తి గతంలో ఎంపీడీఓగా, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఈ ప్రాంతంలో పనిచేసిన విశేష అనుభవం కలిగి ఉండటం, స్థానిక పరిస్థితులపై సమగ్ర అవగాహన కలిగి ఉండడం పర్యాటకాభివృద్ధికి ఎంతో సానుకూలంగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ అనుభవాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు.

ఈ భేటీలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధి, యువత ఉపాధి అవకాశాలు, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *