-వేట్లపాలెం బాణాసంచా ఘటనపై పూర్తి స్థాయి విచారణకు కమిటీ – బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు : సానా సతీష్ బాబు
వేట్లపాలెం, నేటి పత్రిక ప్రజావార్త :
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న బాణాసంచా విస్ఫోటన ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఘటన స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగాలపూడి అనితతో కలిసి ఆయన పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి, ప్రభుత్వ ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, హోంమంత్రి వంగాలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో హాజరయ్యారు.
Prajavartha Online Telugu News