– ఐదేళ్ల పాలనలో అమరావతి రైతులపై చేయని అరాచకం లేదు
– ఇప్పుడు రైతులకు అన్యాయమంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారు
– పేదల ఆస్తుల్ని కొల్లగొట్టిన వైసీపీ నేతలతో కుళ్లు రాజకీయాలు
– మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన
– కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ జరుగుతున్న పాలనను చూసి ఓర్వలేక జగన్ రెడ్డి నీచమైన కుట్రలకు తెరలేపారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఈ మేరకు మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్నారు. ఆర్ధిక సమస్యలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు. మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక జగన్ రెడ్డి తమ దండుపాళ్యం గ్యాంగ్‌తో రాష్ట్రంపై విషం చిమ్ముతున్నాడని మండిపడ్డారు.
జగన్ రెడ్డి లాంటి అరాచక వ్యక్తి నీడ కూడా రాష్ట్రంపై పడకూడదని కన్న తండ్రే బెంగళూరు తరిమేశాడు. జగన్ రెడ్డి అనే క్రిమినల్ ఏపీలో ఉంటే ఏపీని మరో చంబల్ లోయ, బీహార్ లాంటి అరాచక పరిస్థితులు నెలకొంటాయని భయపడ్డాడు. 2019లో అబద్దపు హామీలు, బూటకపు ప్రకటనలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. ప్రజావేదిక కూల్చివేతతో తన పైశాచికత్వాన్ని ప్రారంభించాడు. ఐదేళ్లు అధికారంలో ఉండి కులం, మతం, ప్రాంతం పేరుతో రాష్ట్రాన్ని విడగొట్టాడు. ప్రజా రాజధానిపై కుట్రలు చేశాడు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడి ప్రజల మధ్య చిచ్చు పెట్టాడు. భూములిచ్చిన రైతులపై దాులు చేయించాడు. రక్తాలు కారేలా లాఠీలతో కొట్టించాడు. బూటు కాళ్లతో మహిళల పొత్తి కడుపుల్లో తన్నించాడు. వారిని విమర్శించడమే లక్ష్యంగా పెయిడ్ ఆర్టిస్టుల్ని రంగంలోకి దించాడు. న్యాయస్థానం నుండి దేవ స్థానం పేరుతో పాదయాత్రకు వెళ్లిన మహిళలు, రైతులపై అరాచకానికి పాల్పడ్డాడు.
జగన్ రెడ్డి అరాచకానికి అంతం పలికి.. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతోంది. అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది. అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు వేగవంతమయ్యాయి. పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కేసినోళ్లు కూడా ఇప్పుడు బయటకొచ్చి నీతులు చెబుతున్నారు. అమరావతిలో ఏదో జరిగిపోయిందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు. ప్రజల భూముల్ని కొల్లగొట్టారు. మద్యం వ్యాపారాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు అమరావతిలో అత్యంత పారదర్శకంగా జరిగిన ప్లాట్ల కేటాయింపుపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. గత ఐదు సంవత్సరాలు అమరావతిని శ్మశానం, ఎడారి అంటూ పేట్రేగిపోయి.. ప్రజలు ఈడ్చి తన్నిన తర్వాత మళ్లీ ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు కుట్రలు చేస్తున్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్, హెల్త్, స్ప్రోట్స్ కేంద్రంగా భూ కేటాయింపులు చేస్తే.. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు కట్టుకునే ఇంటిపై కూడా పడి ఏడుస్తున్నారు. క్విడ్ ప్రో కో ద్వారా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లోటస్ పాండ్ లో దాదాపు 25 ఎకరాల్లో 60 బెడ్ రూంలతో భారీ ప్యాలెస్ కట్టుకున్నారు. బెంగళూరులో 31 ఎకరాల్లో భారీ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇక తాడేపల్లి ప్యాలెస్ చుట్టు పక్కల పేదలు ఉండకూడదని ఇళ్లను అత్యంత దుర్మార్గంగా కూల్చి పడేశారు.
గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేయని దోపిడీ లేదు. సృష్టించని అరాచకం లేదు. సచివాలయాలు, స్కూల్ బిల్డిగులకు వైసీపీ రంగులు వేయడానికి, తీయడానికి రూ.3000 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారు. సర్వే రాళ్లపై జగన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడానికి రూ.700 కోట్లు వృథా చేశాడు. రుషికొండకు బోడిగుండు కొట్టి రూ.600 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఐదేళ్ల పాటు సాక్షి మీడియాకు యాడ్స్ పేరుతో రూ.500 కోట్లు దోచిపెట్టడం వాస్తవం కాదా? పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడానికి, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నిర్మాణాల పేరుతో వందల కోట్లు దోచుకున్నారు. అలాంటి వైసీపీ నేతలు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు.
పంచంలోనే మేటి టెక్నాలజీతో అమరావతి నిర్మాణం జరుగుతోంది. ఇతర ప్రాంతాల కంటే తక్కువ ధరకే ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రజా రాజదాని అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతుంటే లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే కక్షతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు.
మలి దశ భూ సేకరణకు కూడా రైతులు మద్దతు పలుకుతుంటే.. వారిని ఎలాగైనా రెచ్చగొట్టాలి. అమరావతి నిర్మాణాన్ని రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు. మావిగన్ అంటూ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్న వైసీపీ నేతలు.. గత ఐదేళ్లు ఏం చేశారు? బందరు పోర్టును కూడా పూర్తి చేయలేని బందరులోని సన్నాసులు ఇప్పుడు మీడియా ముందుకొచ్చి కారు కూతలు కూస్తున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి వచ్చిన నిధులు తప్ప బందరు పోర్టుకు రూపాయి కూ డా రాష్ట్ర బడ్జెట్ నుండి కేటాయించలేదు. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ ప్రతిపాదన చూసి భజన చేస్తున్న కృష్ణా గుంటూరు జిల్లాల్లోని వైసీపీ నేతలకు సిగ్గుందా? మీరు పుట్టి పెరిగిన ప్రాంతంపై కుట్రలు చేస్తుంటే.. తిరగబడాల్సింది పోయి.. తానా అంటే తందానా అనేలా వ్యవహరించడం సిగ్గుచేటు.
కృష్ణా గుంటూరు జిల్లాలను సీఆర్డీఏ పరిధిలో చేర్చాలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కోసం డీపీఆర్ కూడా సిద్ధమవుతోంది. విజయవాడ మచిలీపట్నం రోడ్డు ఆరు వరుసలుగా అభివృద్ధి జరగబోతోంది. అమరావతి నుండి మచిలీపట్నం పోర్టు వరకు ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేయబోతున్నాం. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు ఏ రోజైనా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించారా? జగన్ రెడ్డికి భజన చేయడం, చంద్రబాబును బూతులు తిట్టడం తప్ప సాధించిందేమైనా ఉందా?
అమరావతిలో జరిగే ప్రతి భూ కేటాయింపు కూడా అత్యంత పారదర్శకంగా, అధికారుల కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులతోనే జరుగుతోంది. అంతేగానీ మీలా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆది నుండి చిత్తశుద్ధితో పని చేస్తోంది. రాయలసీమకు గతంలో కియా తీసుకొచ్చాం. ఇప్పుడు డ్రోన్స్, డిఫెన్స్ తయారీ సంస్థలు తీసుకొచ్చాం. ఈ మధ్యనే రాయల్ ఎన్ ఫీల్డ్ తీసుకొచ్చాం. ఉత్తరాంద్రలో భోగాపురం విమానాశ్రయం, గూగుల్ డేటా సెంటర్, అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి పని చేస్తుంటే.. ప్రజల్లో విష బీజాలు నాటేందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటే సహించేది లేదు.
పేదల బియ్యాన్ని బొక్కేసిన పందికొక్కులు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. వైసీపీ నేతల వైఖరి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారిని ప్రధాని నరేంద్ర మోదీ కలవడంపై కూడా నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు వచ్చి మా నాయకుల్ని కలిశారు. మీ చరిత్ర చూసి ఏ ఒక్కరూ కనీసం పలకరించకపోగా.. అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు. ప్రపంచంలోనే భారత దేశాన్ని మూడో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన వ్యక్తి మోదీ. దేశం కోసం దేశ భవిష్యత్ కోసం అనునిత్యం శ్రమిస్తున్న వ్యక్తిపై కూడా వైసీపీ నేతలు కారుకూతలు కూస్తే.. ప్రజలు కర్రుకాల్చి వాతలు పెట్టడం తధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Prajavartha Online Telugu News