అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతుందని వెల్లడించారు.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం నుండి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.
వీటి ప్రభావంతో బుధవారం (13-05-26) అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో(07) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్నిప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
మంగళవారం కర్నూలు(జి) నగరడోనలో 42.9°C, నంద్యాల(జి) కొత్తపల్లెలో 42.4°C, పోలవరం(జి) ఎర్రంపేటలో 42°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 41.9°C, మర్కాపురం(జి) కంభంలో 41.7°C, పల్నాడు(జి) గురజాలలో 41.3°C, అనంతపురం(జి) తెరన్నపల్లి, వైఎస్సార్ కడప(జి) జమ్మలమడుగులో 41.1°C, అనకాపల్లి(జి) దేవరపల్లిలో 41°C, పశ్చిమగోదావరి(జి) తాడేపల్లిలో 40.6°C, చిత్తూరు(జి) రాయలపేటలో 40.5°C, ఏలూరు(జి) కుక్కునూరులో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News