గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డెంగ్యూ వ్యాధి నియంత్రణకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, ఈ నెల 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో డెంగ్యూ వ్యాధిపై అవగాహన పెంపొందించడం, దోమల నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, డ్రోన్ ల ద్వారా యాంటీ లార్వ చర్యలు, ఫాగింగ్, నిల్వ నీటిని తొలగించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వార్డు స్థాయిలో ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది ఇంటింటి తనిఖీలు చేపట్టి దోమల పెరుగుదలకు కారణమయ్యే పరిస్థితులను గుర్తించి తక్షణ నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది డెంగ్యూ దినోత్సవం “తనిఖీ చేయండి–శుభ్రపరచండి–మూతపెట్టండి” (Check–Clean–Cover) అనే థీమ్‌తో నిర్వహించబడుతుందన్నారు. డెంగ్యూ వ్యాధి ఏడీస్ అనే దోమ కాటు ద్వారా వ్యాపిస్తుందని, ఇవి ప్రధానంగా ఇళ్లలో నిల్వ ఉండే శుభ్రమైన నీటిలో పెరుగుతాయన్నారు. కావున ప్రజలు తమ ఇళ్ల పరిసరాలలో ఉన్న కూలర్లు, పూల కుండీలు, కొబ్బరి చెక్కలు, పాత టైర్లు, ఫ్రిజ్ ట్రేలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారానికి ఒకసారి నీటి నిల్వ పాత్రలను తనిఖీ చేసి శుభ్రం చేయాలని, నీటి ట్యాంకులు, డ్రమ్ములు, బిందెలకు తప్పనిసరిగా మూతలు పెట్టాలని కోరారు. వ్యక్తిగత జాగ్రత్తల్లో భాగంగా పూర్తి చేతులకు దుస్తులు ధరించాలని, దోమతెరలు ఉపయోగించవచ్చని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని, వైద్యుల సూచనలు లేకుండా స్వయంగా మందులు వాడకూడదని హెచ్చరించారు. ఈ దినోత్సవం సందర్భంగా వార్డు సచివాలయాల పరిధిలో అవగాహన ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News