-రైతుల సంక్షేమానికి పెద్దపీట.. మహిళల సాధికారతకు అండగా కేడీసీసీబీ
-వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) చైర్మన్ నెట్టెం రఘురాం ఆధ్వర్యంలో రైతులు, డ్వాక్రా మహిళలకు మొత్తం రూ.21.31 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. మైలవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, మహిళల ఆర్థిక సాధికారతే కేడీసీసీబీ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడం ద్వారా వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తున్నామని, మహిళలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా కుటుంబాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని తెలిపారు.
మైలవరం నియోజకవర్గ పరిధిలోని మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కొత్తూరు తాడేపల్లి, భవానిపురం బ్రాంచీల ద్వారా ఈరోజు మొత్తం రూ.21.31 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందులో మైలవరం బ్రాంచ్‌కు రూ.11.93 కోట్లు, జి.కొండూరు బ్రాంచ్‌కు రూ.4.51 కోట్లు, ఇబ్రహీంపట్నం బ్రాంచ్‌కు రూ.3.50 కోట్లు, కొత్తూరు తాడేపల్లి బ్రాంచ్‌కు రూ.0.62 కోట్లు, భవానిపురం బ్రాంచ్‌కు రూ.0.75 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
నెట్టెం శ్రీ రఘురాం గారు కేడీసీసీబీ ప్రగతిని వివరిస్తూ, మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు ప్రధాన బ్రాంచీలలో 2026 మే 31 నాటికి రూ.319.59 కోట్ల డిపాజిట్లు, రూ.723.25 కోట్ల రుణాలు నమోదైనట్లు తెలిపారు. అలాగే 28 సహకార సంఘాలలో 27 సంఘాలు లాభాల్లో కొనసాగడం సహకార రంగం బలోపేతానికి నిదర్శనమన్నారు.
జిల్లా వ్యాప్తంగా కేడీసీసీబీ సాధించిన విజయాలను వివరిస్తూ, 2026 మే 31 నాటికి రూ.3,981.13 కోట్ల డిపాజిట్లు, రూ.8,615.78 కోట్ల రుణాలతో మొత్తం రూ.12,596.92 కోట్ల వ్యాపార పరిమాణాన్ని నమోదు చేసినట్లు వెల్లడించారు. రైతులు, మహిళలు, ఖాతాదారులు బ్యాంకుపై ఉంచిన విశ్వాసమే ఈ విజయాలకు కారణమని పేర్కొన్నారు.
“రైతు బలపడితే రాష్ట్రం బలపడుతుంది.. మహిళ ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత కోసం కేడీసీసీబీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది” అని నెట్టెం శ్రీ రఘురాం గారు అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే రైతులకు పంట రుణాలు అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెంపు, రైతుల ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అలాగే మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాల మహిళలకు అందిస్తున్న రుణాలు వారి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి దోహదపడటంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరింపజేస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అక్కల రామ్మోహనరావు (గాంధీ), కేడీసీసీబీ సీఈఓ శ్యామ్ మనోహర్, జనరల్ మేనేజర్ రంగబాబు, AGM వాసవి కుమారి సహకార శాఖ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, సూపర్వైజర్లు, సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, కార్యదర్శులు, బ్యాంకు సిబ్బంది, రైతులు, డ్వాక్రా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News