వెల్లటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) నూతన శాఖను గురువారం ఘనంగా ప్రారంభించారు. కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం మరియు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి శాఖను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, రైతులు, మహిళా సంఘాలు, చిరు వ్యాపారులకు ఆధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో బ్యాంకు విస్తరణ చేపడుతున్నామని తెలిపారు. వెల్లటూరు శాఖ ప్రారంభంతో ఈ ప్రాంత ప్రజలకు పంట రుణాలు, డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు, డిపాజిట్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, సహకార రంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెల్లటూరు ప్రజల చిరకాల కోరిక నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడంలో ఈ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, బ్యాంకు అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News