-భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాం
-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
-కుటుంబ సమేతంగా రొట్టెను స్వీకరించిన కలెక్టర్ దంపతులు
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల శనివారం కుటుంబ సమేతంగా దర్గాను సందర్శించారు. అనంతరం స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద భక్తులతో మమేకమై సాంప్రదాయబద్ధంగా రొట్టెను స్వీకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, రొట్టెల పండుగ మతసామరస్యానికి, భక్తుల ప్రగాఢ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసే ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు తదితర అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మంత్రి నారాయణ గారి ప్రత్యేక చొరవతో భక్తుల భద్రత కోసం నాలుగు ప్రత్యేక డ్రోన్లను 24గంటలు విజువల్స్ పరిశీలించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జిల్లా పోలీసు శాఖ, నగరపాలక సంస్థ, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ అజిత, మున్సిపల్ కమిషనర్ నందన్ ప్రతిరోజు దర్గా ప్రాంతంలో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టామని, జిల్లా యంత్రాంగం కల్పించిన సౌకర్యాల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. రొట్టెల పండుగ ముగిసే వరకు అప్రమత్తంగా పనిచేస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News