Breaking News

డీఎస్సీ అక్రమాలపై ‘సిబిఐ’ విచారణ జరిపించాలి

-విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి
-ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల భారీ ర్యాలీలు
-వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసిందని, ఉద్యోగాల భర్తీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోనూ జనహిత సదనం కార్యాలయంలో ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ర్యాలీ పోస్టర్‌ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, కేంద్రంలో నీట్ లీకేజీ వ్యవహారంపై విమర్శలు వచ్చినప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మరి రాష్ట్రంలో డీఎస్సీలో ఇన్ని అక్రమాలు, అక్రమ ఎంపికలు జరుగుతుంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదు? లోకేష్ రాజీనామా ఎప్పుడు చేస్తారు? అని నిలదీశారు. విద్యాశాఖలోనే పనిచేస్తున్న ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి డీఎస్సీలో మొదటి ర్యాంక్ రావడం అనేక అనుమానాలకు తావిస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. టాపర్ల జాబితాపై సర్వత్రా విమర్శలు రావడంతో ప్రభుత్వం వెబ్‌సైట్ నుంచి మొదటి లిస్ట్ డేటాను తొలగించడం ద్వారా తమ తప్పును ఒప్పుకుందని మండిపడ్డారు. అసలు పరీక్ష రాయని వారికి కూడా ఉద్యోగాలు కట్టబెట్టారని, నకిలీ సర్టిఫికెట్లతో ఎంపికలు పూర్తి చేశారని విమర్శించారు. జీ.వో. 4.47 ద్వారా నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని తీవ్రంగా దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన దందాలపై స్పష్టమైన ఆధారాలు బయటపెట్టినా ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఈ అక్రమాల వల్ల లక్షలాది మంది కష్టపడి చదివిన నిరుద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ​డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వైయస్సార్సీపి విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇది మెగా డీఎస్సీ కాదని… నిరుద్యోగ అభ్యర్థులను ఘోరంగా ముంచిన దగా డీఎస్సీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ ఉపాధ్యాయ పోస్టులను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలపై ఇన్ని వివాదాలు, అక్రమాలు వెలుగులోకి వస్తున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పలేక నోరు మెదపకుండా పారిపోయారని రవిచంద్ర విమర్శించారు. 16,347 పోస్టుల పేరుతో నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఆరోపించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన దందాలపై తక్షణమే సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, లేనిపక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని రవిచంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, సురేష్, ఈసరపు రాజు, మాత మహేష్, ఝాన్సీ, సీతారామ్, హరిరేంద్ర వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *