-రాష్ట్రంలో అమలుకు సన్నహాలు
-1000 మీ మార్డుల ఏర్పాటుకు కేంద్రం సహకారం
-రేషన్ బియ్యం లో 10 శాతం నూకల బియ్యం ఉండేలా చర్యలు
-ఢిల్లీ పర్యటనలో పౌర సరఫరాల శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి, ఉన్నతాధికారులను కలిసిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రజలకు స్టీమ్ రైస్ అందించడం ద్వారా వారికి పౌర సరఫరాల శాఖ సేవలను మరింత చేరువ చేయొచ్చని, దీనిద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందడంతో పాటు, బియ్యం అక్రమ రవాణా నిరోధానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని దీనికి కేంద్ర పౌర సరఫరాల శాఖ సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు.
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి తో పాటు శాఖ ఉన్నతాధికారులను వరుసగా కలిశారు. నేషనల్ కోఆపరేటివ్ కన్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సీసీఫ్) ఎండీ శ్రీమతి అనీస్ జోసఫ్ గారిని కలిసి రాష్ట్రంలో 1000 ‘‘మీమార్టు’’ ల ఏర్పాటుపై తగిన సహకారం కోరుతూ ఎంఓయూ చేసుకున్నారు.
అనంతరం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ జాయింట్ సెక్రటరీ రవిశంకర్, పాలసీ అండ్ ఎఫ్సీఐ జాయింట్ సెక్రటరీ శిఖా గారిని కలిశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మనోహర్ సీఎంఆర్ సేకరణ, స్టీమ్ రైస్ పంపిణీ, మీ మార్టుల ప్రారంభం, రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతులు వంటి అనేక అంశాలను చర్చించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక పాయింట్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాలను చేపడుతున్నవిషయాన్ని కేంద్ర మంత్రివర్యుల వద్ద ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రావల్సిన అనుమతులు, సహకారం, పెండింగ్ నిధుల విషయాలను ప్రత్యేకంగా మంత్రివర్యుల ముందుంచారు. రాష్ట్రంలోని 41 వేల పాఠశాలలు, 4 వేల వసతి గృహాల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్టీమ్ రైస్ వాడకం ద్వారా అందుతున్న నాణ్యమైన భోజనంపై సానుకూలత ఉందని, దీన్ని ప్రజాపంపిణీ వ్యవస్థకు అనుసంధానం చేసి పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక జిల్లాలో మొదలుపెట్టేలా అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రివర్యుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఆయన తెలిపారు. బియ్యం సంచులపై ఆర్ఎఫ్ఐడీ ను ముద్రించడం ద్వారా అక్రమ రవాణా అరికట్టడానికి దోహదపడుతుందని, దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలన్నారు. రేషన్ బియ్యం లో 10 శాతం నూకల బియ్యం అందిస్తే, ప్రజా పంపిణీలో మంచి ఫలితాలు ఉంటాయని, దీన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే పెండింగ్ ఉన్న నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే వివిధ అంశాలపై కేంద్ర మంత్రివర్యులతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మంత్రి వెంట పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు , పౌర సరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News