-ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ఏఎస్ఆర్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం
-2,703 ఎకరాల విస్తీర్ణం, రూ.4,727 కోట్ల ప్రాజెక్టు. 3,800 మీటర్ల రన్‌వే
-తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం
-500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీ
-ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గ్రోత్ ఇంజిన్‌గా భోగాపురం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో మైలురాయి ఆవిష్కృతం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే నెల నుంచి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఆగస్టు ఒకటో తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం వస్తున్నారు. ప్రధాని రాకకు… విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్రాజెక్ట్ కీలకం కావడంతో ఈ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. విశాఖను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన నగరాల సరసన చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో అదే స్థాయి ప్రమాణాలతో భోగాపురం ఎయిర్ పోర్టు సిద్దమైంది. కేవలం విమాన ప్రయాణ కేంద్రంగానే కాకుండా.. పరిశ్రమలు, ఉపాధి, ఎగుమతులు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకు కేంద్రబిందువుగా మారేలా అల్లూరి సీతారామ రాజు ఎయిర్ పోర్టుకు రూపకల్పన చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటి. నిర్మాణం ప్రారంభమైన కేవలం 31 నెలల్లోనే పనులు పూర్తి చేయడమే కాకుండా, మొదట నిర్ణయించిన గడువుకంటే దాదాపు ఐదు నెలల ముందే సిద్ధం చేశారు. ఉమ్మడి విశాఖపట్నం–విజయనగరం–శ్రీకాకుళం జిల్లాల ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు, ఎగుమతులకు, లాజిస్టిక్స్‌కు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మౌలిక వసతిగా మారనుంది.
రూ.4,727 కోట్లతో అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం
జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GVIAL) ద్వారా పీపీపీ విధానంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (DBFOT) పద్ధతిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. మొత్తం 2,703.26 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమగ్ర ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. విమానాశ్రయం –2,203 ఎకరాలు, ఏవియేషన్ హబ్ – 500 ఎకరాలు, ఏవియేషన్ యూనివర్సిటీ/ఎడ్యుసిటీ 136 ఎకరాలు కేటాయించారు. విమానాశ్రయ పరిధిలో ఎయిర్‌సైడ్ డెవలప్‌మెంట్, సిటీ సైడ్ కమర్షియల్ డెవలప్‌మెంట్, రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక వసతులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారు. 3,800 మీటర్ల పొడవైన రన్‌వే ఈ విమానాశ్రయానికి ప్రధాన ఆకర్షణ. వైడ్‌బాడీ విమానాల కార్యకలాపాలకు అనుకూలంగా దీనిని రూపొందించారు. అంటే బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A330, ఎయిర్ బస్ A340 వంటి భారీ ఎయిర్ క్రాఫ్టులు భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించగలవు. ఇక ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్, నావిగేషన్ ఎయిడ్స్, CNS/ATM ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలు ఈ ఎయిర్ పోర్టులో అందుబాటులో ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రమాణాలతో ఎయిర్‌సైడ్ మౌలిక వసతులను అభివృద్ధి చేశారు.
భవిష్యత్‌లో 4 కోట్ల మంది ప్రయాణించేలా విస్తరణ
భోగాపురం విమానాశ్రయాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాడ్యులర్ విధానంలో అభివృద్ధి చేశారు. తొలి దశలో ఏటా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. భవిష్యత్‌లో దశలవారీ విస్తరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా విస్తరించేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ టెర్మినల్, ఎయిర్‌సైడ్, కమర్షియల్ మౌలిక వసతులను విస్తరించేందుకు వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం, వేగవంతమైన ప్రాసెసింగ్, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచేందుకు కాంటాక్ట్ బోర్డింగ్ బ్రిడ్జిలు, కామన్ యూజ్ పాసింజర్ ప్రాసెసింగ్ వ్యవస్థ, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, సెల్ఫ్ సర్వీస్ పాసింజర్ ప్రాసెసింగ్, స్మార్ట్ సర్వైవలెన్స్, యాక్సెస్ కంట్రోల్, సెక్యూర్టీ మేనేజ్మెంట్ సిస్టం, ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.
25 వేల మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యం
ఉత్తరాంధ్ర ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకంగా మారనుంది. ఇక్కడ ఏటా 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేకించి కార్గో టెర్మినల్ అభివృద్ధి చేశారు. ఫార్మా, మెరైన్ ప్రొడక్ట్స్, అధిక విలువైన, పెరిషయబుల్ ఉత్పత్తుల రవాణాకు అవసరమైన టెంపరేచర్ కంట్రోల్డ్ కోల్డ్ చైన్ సదుపాయాలు కల్పించారు. దీంతో ఉత్తరాంధ్ర నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు వేగవంతం కానున్నాయి. భవిష్యత్‌లో విశాఖపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లతో అనుసంధానం ద్వారా భోగాపురం తూర్పు తీరంలో కీలకమైన ఎయిర్ కార్గో, లాజిస్టిక్స్ హబ్‌గా ఎదగనుంది. భోగాపురం విమానాశ్రయం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా అభివృద్ధి చేశారు. దీంట్లో భాగంగా 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, ఎనర్జీ ఎఫిషియెంట్ HVAC వ్యవస్థ, ఎల్ఈడీ ఎయిర్ పోర్టు లైటింగ్, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టం, రెయిన్ వాటర్ హర్వెస్టింగ్, వాటర్ రీ-సైక్లింగ్, మురుగు నీటి శుద్ధి చేసే ప్లాంట్లు, ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వ్యవస్థలతో పర్యావరణ హిత విమానాశ్రయాన్ని ఏర్పాటు అయింది. విమానాశ్రయ నీటి అవసరాల్లో సుమారు 30 శాతం రీసైకిల్ చేసిన నీటితో తీర్చేలా ప్రణాళిక రూపొందించారు. విమానాశ్రయాన్ని LEED Platinum ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ఆధునిక సాంకేతికతకు ప్రతీకగా ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ కళా, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. ఎయిర్ పోర్టును ఉత్తరాంధ్ర తీరం ప్రతిబింబించేలా ‘ఫ్లయింగ్ ఫిష్’ నమూనాలో తీర్చిదిద్దారు. టెర్మినల్ నిర్మాణానికి బంగాళాఖాతం ఆకారంలో డిజైన్ చేశారు. టెర్మినల్ పైకప్పు, సీలింగ్ డిజైన్లలో సంప్రదాయ పద్ధతుల్ని ఉపయోగించారు. ఆధునిక ఆర్కిటెక్చర్‌ను స్థానిక సంస్కృతి, కళా సంప్రదాయాలతో మేళవించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు.
కీలక అనుమతులు లభ్యం… కార్యకలాపాలకు సిద్ధం
విమానాశ్రయ కార్యకలాపాలకు అవసరమైన కీలక అనుమతులు పొందారు. డీజీసీఏ ఎయిరో డ్రోమ్ లైసెన్స్, వాలిడేషన్ ఫ్లైట్ క్లియరెన్స్, బీసీఏఎస్ సెక్యూర్టీ క్లియరెన్స్, PESO అప్రూవల్, ఫైర్ సేఫ్టీ అనుమతులు ఉన్నాయి. అదేవిధంగా Operational Readiness and Airport Transfer (ORAT) కార్యక్రమం కింద పూర్తి స్థాయి ట్రయల్స్ నిర్వహించారు. ఎయిర్‌లైన్స్, గ్రౌండ్ హ్యాండ్లర్లు, భద్రతా సంస్థలు, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది భాగస్వామ్యంతో వివిధ ప్రక్రియలను పరీక్షించి, విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వ్యవస్థలను సిద్ధం చేశారు. భోగాపురం విమానాశ్రయాన్ని కేవలం ప్రయాణికుల విమానాశ్రయంగా కాకుండా సమగ్ర ఏవియేషన్ ఎకోసిస్టమ్‌గా అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. విమానాశ్రయానికి ఆనుకుని ఏవియేషన్ హబ్ అభివృద్ధి చేయనున్నారు. ఇది భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్, నెట్-జీరో ఫోకస్డ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్ గా అభివృద్ధి చేసే ప్రతిపాదన ఉంది. ఈ హబ్‌లో MRO కేంద్రాలు, ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ, ఎయిర్‌క్రాఫ్ట్ అసెంబ్లీ, ఏవియేషన్ లాజిస్టిక్స్, కార్గో మౌలిక వసతులు, డిజైన్, R&D కేంద్రాలు, ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీలు, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలు, ఇన్నోవేషన్ కేంద్రాలు వంటి వాటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ ఏవియేషన్ హబ్ ద్వారా సుమారు రూ.20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే 60,000కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 1.20 లక్షలకు పైగా పరోక్ష ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం ఉందని అంచనా.
ఏవియేషన్ ఎడ్యుసిటీతో మరిన్ని అవకాశాలు
విమానాశ్రయానికి అనుబంధంగా జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అభివృద్ధి చేయనున్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీల రంగాల్లో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఇన్నోవేషన్‌కు ఇది కేంద్రంగా మారనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.3,000–5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, దాదాపు 9,000 మంది విద్యార్థులు, ఏటా 4,000 మంది ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పార్టిసిపెంట్లకు అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఉంది. అంతర్జాతీయ, జాతీయ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యం. భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక భాగస్వామిగా నిలిచింది. భూమి సమీకరణ, నీటి సరఫరా, విద్యుత్, రహదారులు తదితర మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1,582.97 కోట్లు వెచ్చించింది. భూసేకరణ –రూ.944.40 కోట్లు, నీటి సరఫరా –రూ.75 కోట్లు, విద్యుత్ సరఫరా –రూ.97.31 కోట్లు, ఫండెడ్ వర్క్స్ –రూ.134.55 కోట్లు, కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి –రూ.301.46 కోట్లు, రహదారి కనెక్టివిటీ –రూ.3.25 కోట్లు, ఇరిగేషన్ కెనాల్ పనులు –రూ.27 కోట్లు ఖర్చు చేశారు. విమానాశ్రయానికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్లు, మెయిన్ యాక్సెస్ రోడ్లు, ఇతర కనెక్టివిటీ మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేశారు. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు కోస్తా ప్రాంతం, పొరుగు రాష్ట్రాల ప్రాంతాలకు కూడా విమానయాన కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది.
ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో కొత్త ఆర్థిక అవకాశాలు తెరుచుకోనున్నాయి. పర్యాటకం, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, గిడ్డంగులు, ఎగుమతులు, ఫార్మా, మెరైన్ ఉత్పత్తులు, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, తయారీ రంగాలకు ఇది కొత్త ఊతం ఇవ్వనుంది. అరకు, లంబసింగి, విశాఖ తీర ప్రాంతం, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ఇది దోహదపడనుంది. విమానాశ్రయం చుట్టూ ఏవియేషన్ హబ్, ఏవియేషన్ యూనివర్సిటీ, కార్గో, లాజిస్టిక్స్, MRO, ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలు అభివృద్ధి చెందడం ద్వారా విశాఖపట్నం–భోగాపురం గ్రోత్ కారిడార్ భవిష్యత్‌లో దేశంలోని కీలక ఆర్థిక, పారిశ్రామిక కారిడార్లలో ఒకటిగా ఎదిగే అవకాశం ఉంది.
గత ప్రభుత్వం వల్లే ఆలస్యం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో ఆలస్యం చోటు చేసుకుంది. 2014–2019 మధ్యకాలంలో భూసేకరణ తదితర ప్రక్రియలను అప్పటి ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు, అనుమతులు, మౌలిక వసతులు, రహదారి కనెక్టివిటీ, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించారు. ఫలితంగా నిర్మాణ పనులు వేగం పుంజుకుని, సుమారు 31 నెలల్లోనే విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయడం సాధ్యమైంది. నిర్దేశించిన షెడ్యూల్ కంటే సుమారు 5 నెలల ముందుగానే నిర్మాణాన్ని పూర్తి కావడం చూస్తే… ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో దృష్టి సారించిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని చాటేలా ప్రతిరూపాన్ని, విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు తొలి విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
ఏఎస్ఆర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి ప్రస్థానం…
• 2015 ఫిబ్రవరి 19– బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో చంద్రబాబు నాయుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రకటించారు.
• 2015 ఫిబ్రవరి 25- GO నెం.63 ద్వారా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం ప్రత్యేక SPV ఏర్పాటు.
• 2016 జనవరి 7– కేంద్ర విమానయాన శాఖ నుంచి సైట్ క్లియరెన్స్.
• 2016 అక్టోబర్ 7– కేంద్రం నుంచి ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్.
• 2017 ఆగస్టు 14– పర్యావరణ అనుమతులు.
• 2019 ఫిబ్రవరి 14– చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్.
• 2024– కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి, నిర్మాణ పనులకు వేగంగా అనుమతులు. సుమారు 31 నెలల్లోనే విమానాశ్రయ నిర్మాణం పూర్తి.
• ఆగస్టు 1, 2026– ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం.
Prajavartha Online Telugu News