-ఎల్ నినో యాక్షన్ ప్లాన్ అమల్లో నిర్లక్ష్యాన్ని సహించను
-తాగునీటి సమస్య తలెత్తకూడదు
-ప్రతి పంటకు బీమా నమోదు చేయించే బాధ్యత కలెక్టర్లదే
-నిరంతరం మానిటరింగ్ చేసేలా ఎల్ నినో కంట్రోల్ రూమ్
-ఎల్ నినోపై క్షేత్ర స్థాయి అంచనాలు… ప్రణాళికలు ఉండాలి
-ఏడాదికి సరిపడా పశుగ్రాసం అందుబాటులో ఉండేలా ప్రణాళికలు
-ఎల్ నినోపై ఆర్ఎస్కేల స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కమిటీలు
ఆగస్టు 3 నుంచి ఎల్ నినోపై అవగాహన కార్యక్రమాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్ నినో కష్టకాలంలో రైతులను ఆదుకోవాలని… వారికి సరైన సమాచారాన్ని సహకారాన్ని అందిస్తూ అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఎల్ నినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఎల్ నినో ప్రభావం ఏ మేరకు ఉంటుంది… దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ వంటి అంశాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో సరాసరి 35 నుంచి 40 శాత మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న అధికారులు… జూన్ – నవంబర్ మధ్య 844 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 551 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. అంచనాలకు మించి ఎల్నినో ప్రభావం ఉండబోతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం అన్ని జిల్లాల్లోనూ ఎల్నినో ప్రభావం చూపిస్తోందని, ఎక్కువగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు చెప్పారు. 2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరిపై ప్రభావం చూపిస్తుందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. వంశధార నుంచి జలాలు అందుబాటులోకి వస్తే వాటిని సద్వినియోగం చేసుకుంటూ పంటలను కాపాడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 122 హై రిస్క్ మండలాలను గుర్తించామని అధికారులు సీఎంకు వివరించడంతో… హై రిస్క్ మండలాల్లో బోరు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఆగస్ట్ 3 నుంచి అవగాహన కార్యక్రమాలు, వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి, అత్యవసర విత్తన ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. కంది, ఆముదం, మినుము పంటలను ఇప్పటికే కొందరు ప్రత్యామ్నాయ పంటలుగా వేస్తున్నారని చెప్పారు. ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఈ నెల 31వ తేదీ వరకు నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నామని… అయితే వరి పంటకు ఆగస్ట్ 15 వరకు సమయం ఉందని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 6.30 లక్షల హెక్టార్ల మేర పంటలను బీమాలో నమోదు చేశామని అధికారులు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ… వేసిన ప్రతి పంటకు బీమా నమోదు చేయాల్సిందేనని… ఏ పంటకైనా బీమా నమోదు చేయకపోతే… దానికి కలెక్టర్లే బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అలాగే తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. 5 నెలలకు సరిపడా 286.30 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పారు. అయితే 5 నెలలకు సరిపడా పశుగ్రాసం సిద్దం చేసుకుంటే సరిపోదని… ఎల్ నినో ప్రభావం ఏడాది పొడవునా కన్పించే సూచనలు ఉండడంతో ఏడాదికి అవసరమైన పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఎల్ నినోపై ప్రతివారం నివేదికలు
ఈ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”ఎల్ నినో ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా మానిటర్ చేశారో… అదే విధంగా ఎల్ నినో అంశాన్ని మానిటర్ చేయాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి… వచ్చిన డేటాను విశ్లేషించాలి.. విశ్లేషించిన డేటా ఆధారంగా సూచనలివ్వాలి.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేయాలి. ఏయే ల్యాండ్ పార్శిళ్లల్లోని పంటలకు ఇబ్బందులో గమనించాలి. అక్కడ బోర్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా..? అనే సమాచారంతో రైతులకు సరైన గైడెన్స్ ఇచ్చేలా వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. అలాగే సదురు ప్రాంతంలో భూగర్భ జలాల పరిస్థితిని కూడా తెలుసుకోవాలి. ఈ సమాచారానికి అనుగుణంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆ ల్యాండ్ పార్శిళ్లకు చెందిన రైతులకు సరైన గైడెన్స్ ఇచ్చేలా అధికారులు కృషి చేయాలి. ఎల్ నినో ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోందనేది రైతులకు ముందుగానే చెప్పాలి. రైతులకు సరైన సమాచారం అందించగలిగితే… పెట్టుబడి వృధా కాదు”అని ముఖ్యమంత్రి అన్నారు.
ఎల్ నినో ఉపద్రవాన్ని అధిగమించడం ఓ సవాల్
“ఇక పశుగ్రాసం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. పశువులకు దాణా కొరత ఉండకూడదు. పాల ఉత్పత్తి ఎంత మాత్రమూ తగ్గడానికి వీల్లేదు. ఈ మేరకు వీబీజీ రామ్ జీ పథకాన్ని ఎల్ నినోలో పూర్తిగా వినియోగించుకోవాలి. అలాగే ఉద్యాన పంటలకు జీ రామ్ జీ నిధులను వాడుకోవచ్చు. ఎల్ నినో ఉపద్రవాన్ని అధికార యంత్రాంగం ఓ సవాల్ గా తీసుకుని పని చేయాలి. మార్కెట్ కమిటీలు, నీటి సంఘాల సభ్యులను ఎల్ నినో అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి. పరిస్థితులను అంచనా వేసేందుకు… రైతులకు సూచనలు చేసేందుకు.. అలాగే వాతావరణ పరిస్థితులను.. పంటలను అధ్యయనం చేసేందుకు వ్యవసాయ యూనివర్శిటీ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి. ఈ మేరకు ఆర్ఎస్కే సిబ్బందిని కన్వీనర్లుగా నియమించుకుని కార్యాచరణ అమలు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. మంత్రి మొదలుకుని అధికార యంత్రాంగం మొత్తం క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ ఉండాలి. ఎల్ నినో వంటి ఉత్పాతాలు సంభవించిన సందర్భాల్లో డెయిరీ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహించాలి. ఎల్ నినో యాక్షన్ ప్లాన్ అమలు చేసే విషయంలో శాఖల మధ్య సమన్వయం తప్పకూడదు. కూరగాయల ధరలు సహా నిత్యావసరాలు ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. మొబైల్ రైతు బజార్లను జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయాలి. వీటిని రైతులు లేదా డ్వాక్రా మహిళలకు అందించాలి”అని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News