-మంగినపూడి బీచ్, ఎన్‌హెచ్216, క్రీడా భవనాలు, మైనింగ్ రంగ అభివృద్ధిపై వినతిపత్రాలు అందజేత
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రెండు రోజుల పాటు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. కృష్ణా జిల్లా చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంతో పాటుగా.. భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు కావాలని విన్నవించారు.
మచిలీపట్నం-బంటుమిల్లి మధ్య 20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి అవసరమైన పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని కలిసి వినతి పత్రం అందించారు. కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ధి, రాష్ట్ర పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా రోడ్డును అభివృద్ధి చేయాలని వినతిపత్రం అందించాను. రోడ్డు నిర్మాణంతో మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్‌కు రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతాయి. ప్రధానంగా మచిలీపట్నం పోర్టు అనుసంధానంగా వచ్చే ఇండస్ట్రియల్ కారిడార్స్, లాజిస్టిక్స్ పార్క్స్, ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ కు సానుకూల వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులు, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశ మైనింగ్ అవసరాలు తీర్చేలా రాష్ట్ర మైనింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారిని కలిసి విన్నవించారు. రాష్ట్రంలో క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, ఆంధ్రా యూనివర్శిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ఏర్పాటు, ఏపీ రేర్ ఎర్త్ కారిడార్ అభివృద్ధిపై వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో కీలకమైన ఖనిజాలు, స్ట్రాటజిక్ మినరల్స్‌కు ప్రపంచ స్థాయి వేల్యూ యాడెడ్ పరిశ్రమ ఏర్పాటు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఏర్పాటు ద్వారా సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు.
కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో క్రీడా సాదుపాయాలు మెరుగు పర్చాలని, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఖేలో ఇండియా నుండి ఆర్ధిక తోడ్పాటు అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే గారిని కలిసి వినతి పత్రం అందించారు. మచిలీపట్నంలోని గో సంఘం వద్ద రూ.17 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం, రూ.9 కోట్ల వ్యయంతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఖేలో ఇండియా ద్వారా సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మచిలీపట్నంలో జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌ల నిర్వహణకు అవకాశాలు మెరుగు పడతాయని, కృష్ణా జిల్లాను క్రీడల కేంద్రంగా మలచేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
మచిలీపట్నంలో పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని, కేంద్రం తోడుగా నిలుస్తే దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా మచిలీపట్నాన్ని నిలుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి వినతి పత్రం అందించారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.120 కోట్ల ఆర్ధిక సాయం అందించాలని, తద్వారా పీపీపీ పద్దతిలో రూ.643 కోట్లు పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించడం ద్వారా మచిలీపట్నంలో పర్యాటకం, వారసత్వ పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి మరియు ఉపాధి కల్పన వేగవంతం అవుతాయన్నారు.
మచిలీపట్నం తీరప్రాంతంలోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రం దృష్టి సారించాలని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్‌భూషణ్ చౌదరి గారిని కలిసి విన్నవించారు. కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రాంతంలో తాగునీటి సమస్యలను వివరించారు. తీర ప్రాంతంలో మంచినీటి సరఫరా నిరంతరం అందేలా చూడాలని, మత్స్యకారుల జీవనోపాధిని కాపాడటానికి, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థను సంరక్షించడానికి తోడ్పాటు అందించాలని విన్నవించారు. మచిలీపట్నం ప్రజల ఆకాంక్షల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, కేంద్రం కూడా తోడ్పాటు అందించాలని విన్నవించారు.
అనంతరం కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూలంకషంగా చర్చించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తిన్నేటి కృష్ణ ప్రసాద్ గారెతో సమావేశమై.. ‘కోస్టల్ హైవే ప్రాజెక్ట్’, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత రూపురేఖలను మార్చడంలో ప్రాముఖ్యతపై చర్చించారు. ఈ ప్రాజెక్ట్ ప్రయోజనాలను, మచిలీపట్నం వరకు విస్తరించడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పర్యాటకరంగం బలోపేతమవుతుంది, మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుందని, బందరు పోర్టు ద్వారా వ్యాపారం విస్తరిస్తుందని తెలియజేశారు.
Prajavartha Online Telugu News