జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్–2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి మినహా అన్ని నోటిఫై చేసిన పంటలకు పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC Bank) చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు.
శనివారం జగ్గయ్యపేటలోని కృష్ణ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో కేంద్ర వ్యవసాయ శాఖ, బీమా సంస్థలతో సమన్వయం చేసి రైతుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని గడువును పొడిగించడం రైతాంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రైతులు పంటల బీమాను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పంటల బీమా రైతుకు ఒక భద్రతా కవచం లాంటిదని, అనుకోని పరిస్థితుల్లో పంట నష్టపోయినా రైతు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. రుణగ్రహీతలు, రుణేతర రైతులు అనే తేడా లేకుండా ప్రతి అర్హ రైతు సాగు చేసిన ప్రతి ఎకరానికి ఆగస్టు 15లోపు పంటల బీమా నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
KDCC బ్యాంకు రైతులకు అండగా ఉంటుంది
కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుతో అనుబంధంగా ఉన్న రైతులందరూ మా బ్యాంకు 59 శాఖలు, 425 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) ద్వారా పంటల బీమా నమోదు చేసుకోవచ్చని నెట్టెం రఘురాం తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బీమా నమోదు ప్రక్రియలో అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు KDCC బ్యాంకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పారు.
బ్యాంకు శాఖల మేనేజర్లు, సిబ్బంది, PACS సీఈఓలు ప్రతి గ్రామంలో రైతులను చైతన్యపరిచి, ఒక్క అర్హ రైతు కూడా పంటల బీమాకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రైతులకు దరఖాస్తు నమోదు, అవసరమైన పత్రాల పరిశీలన, సాంకేతిక సహాయం తదితర సేవలను బ్యాంకు ద్వారా అందిస్తామని తెలిపారు. రైతులు బ్యాంకులు, PACS, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవచ్చని చెప్పారు.
చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే నమోదు చేసుకోవాలని సూచిస్తూ, పంటల బీమా నమోదు చేయని రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం సంభవించినప్పుడు ప్రభుత్వ పరిరక్షణను కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమని, రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ అవసరమైన ప్రతి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటోందని నెట్టెం రఘురాం పేర్కొన్నారు. చివరిగా, కృష్ణా జిల్లా రైతులందరూ ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆగస్టు 15లోపు తప్పనిసరిగా పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని, ఏ సందేహాలున్నా సమీపంలోని KDCC బ్యాంకు శాఖ లేదా PACSను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోచంపల్లి సొసైటీ అధ్యక్షుడు ముల్లంగి రామకృష్ణారెడ్డి గౌరవరం సొసైటీ అధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు కృష్ణ ఫార్మా సొసైటీ అధ్యక్షుడు యానాల గోపీచంద్ పెనుగంచిప్రోలు సొసైటీ ప్రెసిడెంట్ కర్ల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News