Breaking News

న్యాయవాదుల సేవలు లేకుండా ఏ రాజకీయ పార్టీ సమర్థంగా ముందుకు సాగదు

-మన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా… దూషించినా తక్షణమే ఫిర్యాదులు చేయాలి
-కఠిన చర్యలు తీసుకోనేలా చట్ట ప్రకారం ముందుకు వెళ్దాం
-చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో న్యాయవాదుల సేవలు అమూల్యం
-పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు అండగా ఉందాము
-వారిపై గత ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపుతో అన్యాయంగా నమోదైన కేసులను పరిష్కరించేలా సమగ్ర కార్యాచరణ చేపడదాము
-జిల్లాలవారీగా కార్యకర్తల కేసుల పూర్తి వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపించండి
-వారికి న్యాయ సహాయం అందించే ప్రత్యేక ఏర్పాటు
-జనసేన న్యాయవాదుల సమీక్ష సమావేశంలో మాట్లాడిన పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి, శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
న్యాయవాదుల సేవలు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థంగా ముందుకు సాగలేదని జనసేన పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి, శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణలోనైనా, ప్రజా సమస్యల పరిష్కారంలోనైనా, ఎన్నికల ప్రక్రియలోనైనా లేదా చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే సందర్భంలోనైనా న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఏ సమస్య ఎదురైనా, చట్టపరమైన సలహా, సరైన మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది న్యాయవాదులేనని అన్నారు. జనసేన పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల హైకోర్టు న్యాయవాదుల సమీక్ష సమావేశం మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయవాదుల పాత్ర, కొత్త న్యాయవాదులను లీగల్ సెల్ లోకి ఆహ్వానించడం, కార్యకర్తలపై గత ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకునేలా చొరవ తీసుకోవడం, జనవాణి కార్యక్రమంలో వచ్చిన సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరిప్రసాద్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పార్టీ కోసం నిరంతరం సేవలందిస్తూ, పార్టీ పిలుపు మేరకు గత ప్రభుత్వ హయాంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించిన అనేక మంది నాయకులు, కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల కారణంగా వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై అధ్యక్షులవారు కూడా రెండుసార్లు ప్రత్యేకంగా సమావేశమై, ఏ కోర్టులో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, వాటి పరిష్కారం ఎలా సాధ్యమవుతుందనే విషయంపై చర్చించారు. ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కేసుల విషయమై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా మన పార్టీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపుతో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం వాటి స్టేటస్, ఏ కోర్టులో విచారణ జరుగుతోంది, ఏ సహాయం అవసరమనే అంశాలపై పూర్తి నివేదికను సిద్ధం చేసి కేంద్ర కార్యాలయానికి అందించగలిగితే కార్యకర్తలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయడమే కాకుండా, పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు మనం నిజమైన అండగా నిలిచినవారమవుతాం.
కాకినాడలో మన అధ్యక్షుల వారిని దూషించిన ఘటనకు నిరసనగా రోడ్లపైకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేసిన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలపై కేసులు నమోదయ్యాయి. వారు ఇప్పటికీ ఆ కేసుల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే విశాఖ నోవాటెల్ జరిగిన ఘటన, సంఘటన స్థలంలో లేకపోయినా అనుమానాల ఆధారంగా పలువురిపై కేసులు నమోదు చేసి 18 మందిని సెంట్రల్ జైలులో పెట్టారు. ఇలాంటి కేసుల వల్ల అనేక మంది కార్యకర్తలు సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తూ సమయం, మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అందుకే ఈ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చట్టపరంగా ఎలాంటి మార్గాలు ఉన్నాయి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ స్థాయిలో సమన్వయం అవసరం అనే అంశాలపై మీ విలువైన సూచనలు, సలహాలు అందించాలి. అదే విధంగా, మీ జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసులు ఎన్ని ఉన్నాయి, వాటిలో ప్రస్తుతం ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, వాటి ప్రస్తుత స్థితి ఏమిటి అనే పూర్తి వివరాలను సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించండి.
ప్రతి నామినేషన్ చెల్లుబాటు అయ్యేలా చూడాలి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థికి అవసరమైన న్యాయ సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. నామినేషన్ పత్రాలను సక్రమంగా సిద్ధం చేయడం, వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి నామినేషన్ చెల్లుబాటు అయ్యేలా అవసరమైన మార్గదర్శకత్వం అందించడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఇటీవలి కాలంలో పార్టీ అధినాయకుడిపై వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేసే సంఘటనలు సోషల్ మీడియాలో పెరుగుతున్నాయి. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణంగా తీసుకోకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి దూషణలు జరిగాయంటే అధికారమదంతో చేశా రు అని అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే మనం ఏం చేయలేమనే చులకన భావన వారిలో ఏర్పడుతుంది. ఈ విషయంలో పార్టీ నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా పార్టీ అధినాయకుడిని లేదా ముఖ్య నాయకులను చట్టవిరుద్ధంగా దూషిస్తూ, పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేయండి. వర్తించే బలమైన చట్టాల ప్రకారం కేసులు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవడం, చట్టబద్ధమైన చర్యలు సకాలంలో తీసుకోవడం ద్వారా ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్లాల”న్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి కొప్పెర కోటేశ్వరరావు, గుంటూరు లీగల్ సెల్ అధ్యక్షులు అమ్మినాయుడు, కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు కిరణ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది సింగలూరి శాంతిప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి  అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *