అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ సోమవారం నార్త్ వెస్ట్(వాయువ్య) గ్రిడ్‌లో భాగమైన అబ్బరాజుపాలెం, రాయపూడి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించింది. గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామసభల్లో ఏపీ సిఆర్డీఏ అధికారులు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌ల ముఖ్యాంశాలను వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లోని ప్రస్తుత రహదారులను ల్యాండ్ పూలింగ్ స్కీమ్(ఎల్‌పీఎస్) జోన్‌ల ప్రకారం ప్రతిపాదించిన రహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడం, గ్రామ రహదారుల ప్రణాళిక, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై గ్రామస్థులకు వివరించారు.
ఈ ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న రహదారులు, వాటి అనుసంధానంపై సమగ్ర సమాచారం సేకరించేందుకు గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్యాటర్న్ సర్వే, ఎల్‌పీఎస్ రహదారి నెట్‌వర్క్ సర్వే చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వే ద్వారా సేకరించే సమాచారం గ్రామ రహదారుల ప్రణాళికను మరింత సమర్థవంతంగా రూపొందించడంతో పాటు, భవిష్యత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని వివరించారు. సభలో పాల్గొన్న గ్రామస్థులు ప్రతిపాదిత ప్రణాళికలపై తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామస్థుల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించి ఆయా గ్రామాల గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌లను రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీ సిఆర్డీఏ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం రాజధాని గ్రామాలన్నింటిలో దశలవారీగా గ్రామసభలు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ గ్రామసభల్లో ఏపీ సిఆర్డీఏ ప్లానింగ్, డెవలప్‌మెంట్ ప్రమోషన్, సోషల్ డెవలప్‌మెంట్, ఎస్టేట్స్ విభాగాల అధికారులు, “ది అర్బనైజర్ సంస్థ” సాంకేతిక నిపుణులు పాల్గొని గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించడం జరుగుతుంది. రాజధాని అమరావతి నగర పరిధిలోని గ్రామస్తులు.. తమ గ్రామాలలో జరిగే గ్రామసభలలో పాల్గొని అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరడమైనది.
Prajavartha Online Telugu News