న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదలు, వడగాల్పులు, తుఫానులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల అసంఘటిత, దినసరి కూలీలపై పడుతున్న ప్రభావం, వారికి సామాజిక భద్రత కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంభవిస్తున్న తీవ్ర వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ నమోదు చేస్తోందని మంత్రి తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించి వివిధ రంగాల్లో సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర పర్యావరణ శాఖ జాతీయ వాతావరణ అనుసరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
వడగాల్పుల నుంచి కార్మికులను రక్షించేందుకు కేంద్ర కార్మిక శాఖ దేశవ్యాప్తంగా హీట్‌వేవ్ అడ్వైజరీలు జారీ చేస్తోందని, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వెంటనే జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. భారత వాతావరణ శాఖ దేశంలోని పరిశోధనా సంస్థలతో కలిసి వాతావరణ పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు.
రాష్ట్రాల్లో హీట్ యాక్షన్ ప్లాన్లు, కాలానుగుణ, నెలవారీ, విస్తృతకాల వాతావరణ అంచనాలు, జిల్లాల వారీగా హీట్‌వేవ్ ప్రమాద మ్యాపులు, హాట్ వెదర్ హజార్డ్ మ్యాపులు, అలాగే వేసవి ప్రారంభానికి ముందు జాతీయ, రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
విపత్తు నిర్వహణ కోసం విపత్తు నిర్వహణ చట్టం–2005, జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక మార్గదర్శకంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ఆర్థిక సాయం అందించే ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, కేంద్ర ప్రభుత్వం అవసరమైన ఆర్థిక, సాంకేతిక, లాజిస్టిక్ సహాయాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు.
వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి కేంద్రం గుర్తించిన 12 ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందజేస్తాయని ఆయన తెలియజేశారు.
ఈ సందర్బంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావం అత్యధికంగా అసంఘటిత, దినసరి కూలీలపైనే పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న హీట్‌వేవ్ అడ్వైజరీలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు స్వాగతించదగినవే కానీ ప్రభావిత కార్మికులకు ఉపాధి భద్రత, సామాజిక రక్షణ, తక్షణ ఆర్థిక సాయం కల్పించే సమగ్ర విధానాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కార్మికుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Prajavartha Online Telugu News