–10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహోద్యమ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యసనాల నిర్మూలనతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహోద్యమం” పోస్టర్ను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మద్యం, పొగాకు, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యసనాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సమాజంలో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహోద్యమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. పోస్టర్లో పొందుపరిచిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కేవలం 30 సెకన్లలో ప్రతిజ్ఞ చేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, కుటుంబ సంక్షేమం, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో డిఆర్ఓ కే శ్రీధర్ రెడ్డి, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి పి నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ జి శ్రీనివాసరావు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు కవిత, పావని, సత్యనారాయణ, గురునాథ్ బాబు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News