-లోటుపాట్లను సరిదిద్ది చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా కృష్ణాను తీర్చిదిద్దాలి
-రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వి. గాంధీ బాబు, చల్లా మధుసూధన రావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు తమ ఉమ్మడి బాధ్యతగా భావించి సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వి. గాంధీ బాబు, చల్లా మధుసూధన రావు అధికారులను ఆదేశించారు.
కృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వి. గాంధీ బాబు, చల్ల మధుసూదన్ రావు, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ, బాలల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, శిశు సంరక్షణ, బాల కార్మిక నిర్మూలన, జువెనైల్ జస్టిస్ చట్టం అమలు తీరుపై వారు ఐసీడీఎస్, విద్య, వైద్యం, కార్మిక, గ్రామీణ నీటి సరఫరా, పోలీసు, రవాణా, బీసీ, ఎస్సీ సంక్షేమ, సంక్షేమ వసతి గృహాలు, గ్రామ/వార్డు సచివాలయాలు, స్వచ్ఛంద సంస్థలు తదితర శాఖల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వి. గాంధీ బాబు మాట్లాడుతూ.., పిల్లల హక్కుల పరిరక్షణకు చట్టాలు పటిష్ఠంగా ఉన్నప్పటికీ వాటి అమలులో ఉన్న లోటుపాట్లను అన్ని శాఖల సమన్వయంతో అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బాలల సంరక్షణ సంస్థలను పరిశీలించిన అనంతరం ఈ సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. సమీక్ష ఉద్దేశం తప్పులను ఎత్తిచూపడం కాదని, లోపాలను గుర్తించి సరిదిద్ది జిల్లాను మరింత చైల్డ్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడమేనని చెప్పారు. పిల్లల హక్కులు ఇంటి నుంచే ప్రారంభమవుతాయని, తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి భావాలను అర్థం చేసుకోవాలని సూచించారు. పిల్లలను ఇతరులతో పోల్చడం, మార్కుల కోసం ఒత్తిడి చేయడం, అవమానించడం వంటి చర్యలు వారి మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంటూ, “ఓటమి గెలుపుకు నాంది” అనే భావనను ప్రతి కుటుంబం, ప్రతి పాఠశాలలో అలవర్చాలని సూచించారు.
ఐసీడీఎస్ శాఖ సమర్పించిన వివరాలను సమీక్షించిన కమిషన్ సభ్యులు జిల్లాలో మొత్తం 1,707 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వాటిలో 1,596 ప్రధాన కేంద్రాలు, 111 మినీ అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని తెలుసుకున్నారు. గ్రోత్ మానిటరింగ్, పోషకాహార కార్యక్రమాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మౌలిక వసతులపై అధికారులను ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర పోషకాహార లోపం (SAM)తో బాధపడుతున్న చిన్నారులను వెంటనే న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్లకు (NRC) తరలించాలని, తల్లిదండ్రులకు విస్తృతంగా కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిల్లల జీవించే హక్కు, ఆరోగ్యంగా ఎదిగే హక్కును పరిరక్షించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని కమిషన్ సహించదని స్పష్టం చేశారు.
చల్లా మధుసూధన రావు మాట్లాడుతూ.., పిల్లల సంక్షేమం ఒక్క మహిళా, శిశు సంక్షేమ శాఖ లేదా ఐసీడీఎస్ బాధ్యత మాత్రమే కాదని, విద్య, వైద్యం, పోలీసు, కార్మిక, రవాణా, రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయాలు సహా ప్రతి శాఖ సమాన బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లలు రోడ్డు ప్రమాదాలకు గురైనా, ఆహార విషబాధ జరిగినా, వైద్యం అందకపోయినా, మత్తు పదార్థాలకు బానిసైనా, అపహరణకు గురైనా అది ఒక్క శాఖ బాధ్యత కాదని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బాధ్యతగా భావించాలని సూచించారు. పిల్లలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారని, అలాంటి చిన్నారుల హక్కులను పరిరక్షించడంలో అధికారులు సేవాభావంతో పనిచేయాలని కోరారు. సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతున్న ఆహార మెనూ, పోషకాహారం, ఆర్‌వో ప్లాంట్లు, తాగునీటి సౌకర్యాలపై అధికారులను ప్రశ్నించి ప్రభుత్వం అమలు చేస్తున్న తాజా మెనూను తప్పనిసరిగా పాటించాలని, పాత వివరాలతో నివేదికలు సమర్పించవద్దని సూచించారు. పనిచేయని ఆర్‌వో ప్లాంట్లను వెంటనే మరమ్మతు చేసి పిల్లలకు సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషన్ నిధుల ఖర్చును కాకుండా పిల్లలకు అందాల్సిన విద్య, ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, సంక్షేమ సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న అంశాలనే ప్రధానంగా సమీక్షిస్తుందని స్పష్టం చేశారు.
జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ.., బాలల హక్కుల పరిరక్షణ అనేది అన్ని ప్రభుత్వ శాఖల ఉమ్మడి బాధ్యత అని అన్నారు. కమిషన్ సభ్యులు జిల్లాలో పర్యటించి చేసిన పరిశీలనలు, సూచనలను అధికారులు సానుకూల దృక్పథంతో స్వీకరించి వాటిని కార్యాచరణగా మార్చాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, విద్య, భద్రత, పోషకాహారం, రక్షణ వంటి అంశాలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని, చిన్నారుల సమగ్ర అభివృద్ధికి తీసుకునే ప్రతి చర్య దేశాభివృద్ధికి పెట్టుబడిగా భావించాలని అన్నారు. ప్రతి మూడు నెలలకు కమిషన్ నిర్వహించే సమీక్షల్లో సూచించిన అంశాలపై సంబంధిత శాఖలు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సిద్ధం చేసి పురోగతిని తెలియజేయాలని, సమావేశ మినిట్స్‌ను అన్ని శాఖలకు పంపించి వాటి అమలుపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డిఆర్ఓ కే శ్రీధర్ రెడ్డి, ఏఎస్పి వివి నాయుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సువార్త, ఐసిడిఎస్ పిడి ఐ విమల, డిఇఓ యువి సుబ్బారావు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ దయాకర్, బీసీ వెల్ఫేర్ అధికారి జి రమేష్, డిటిడబ్ల్యుఓ ఫణి ధూర్జటి, సోషల్ వెల్ఫేర్ డిడి షేక్ షాహిద్ బాబు తదితర శాఖల అధికారులు, సంక్షేమ వసతి గృహాల అధికారులు, సిడిపివోలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News