గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో లే అవుట్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు అందిన దరఖాస్తులను ఈ నెల 15లోపు పరిష్కరించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు పట్టణ ప్రణాళిక అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వార్ద్ సచివాలయాల వారీగా ప్లానింగ్ కార్యదర్శులు తమ లాగిన్ లలో లే అవుట్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) అప్లికేషన్లను సమగ్రంగా పరిశీలించి, ఈ నెల 15 లోపు పరిష్కరించాలని ఆదేశించారు. గుంటూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా డిక్లేర్ చేశామని, అయినప్పటికీ నగరంలోని కొన్ని ప్రదేశాల్లో గోడల పై పోస్టర్లను యధేచ్చగా అతికిస్తున్నారని, గోడలపై పోస్టర్లను అతికించకుండా కార్యదర్శిలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని, ఎవరైనా పోస్టర్లు అతికిస్తే, వాటిని తొలగించి, అతికించిన వారికి అపరాధ రుసుము విధించుటయే కాక, వారి పై పోలీస్ కేసులు పెట్టి, మరల భవిష్యత్ లో పోస్టర్లు అతికించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ప్రజలు భవన నిర్మాణాల సమయంలో నిర్మాణ సామగ్రి రోడ్లపై వేయుట వలన స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్యదర్శులు వారి వారి సచివాలయాల పరిధిలో బిల్డింగ్ మెటీరియల్ రోడ్ల పై వేయకుండా చూడాలని, ఎవరైనా వేస్తె సదరు మెటీరియల్ ను సీజ్ చేసి, వారికి అపరాధ రుసుము విధించాలని ఆదేశిచారు. అంతేకాక భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన ప్లాన్ ను కూడా రద్దు చేయాలన్నారు. అలాగే నక్ష సర్వే ఈ నేల ఆఖరు నాటికి పూర్తి చేయాలని, ఈ సర్వే పై సందేహాలు ఏమైనా ఉంటె అధికారులను సంప్రదించి, సందేహాలను వృత్తి చేసుకోవాలన్నారు. ముఖ్యంగా నగరంలోని బృందావన్ గార్డెన్స్, తారక రామ నగర్, కే.వి.పి కాలనీలలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు స్తల సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపిలు రెహ్మాన్, జకీరా, టిపిఎస్ లు, టిపిబిఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News