-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్‌సింగ్‌నగర్‌లోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్, ఎంబీపీ స్టేడియం పరిసర ప్రాంతాలు, కొత్త రాజరాజేశ్వరి పేట, సింగనగర్ ప్రాంతాలను విస్తృతంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, మౌలిక వసతులు, డ్రైనేజీ వ్యవస్థ, ఖాళీ స్థలాల వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో నిల్వ ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. నగరంలో వ్యర్థాల నిర్వహణను కేవలం సేకరణ, తరలింపుకే పరిమితం కాకుండా, వ్యర్థాల నుండి సంపద అనే భావనతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
అనంతరం సింగనగర్ ప్రాంతంలోని ఖాళీ స్థలాలను పరిశీలించిన కమిషనర్, ఆయా స్థలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో మెప్మా మార్ట్ ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు దోహదపడే విధంగా ఈ ప్రణాళికను త్వరితగతిన అమలు చేయాలని సూచించారు.
తదుపరి పాత రాజరాజేశ్వరి పేటలోని సుందరమ్మ దిబ్బ ప్రాంతాన్ని పరిశీలించారు. బుడమేరు కాలువలో కలిసే అవుట్‌ఫాల్ డ్రెయిన్ వద్ద వర్షాకాలంలో నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా అవసరమైన బాక్స్ కల్వర్టులు నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో నీటి నిల్వలు, ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ కె. ప్రభుదాస్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాల కృష్ణ మూర్తి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News