– అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం మండలం మొరుసుమిల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలు, పూర్వ ప్రాథమిక విద్యాబోధన, పోషకాహారం, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి పేర్లు, చదువుతున్న విషయాలు, అంగన్వాడీ కేంద్రంలో నేర్చుకుంటున్న అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ అంశాలపై చిన్నారుల ప్రతిస్పందనలను పరిశీలించారు. చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు, వారి శారీరక, మానసిక వికాసానికి అవసరమైన విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, పూర్వ ప్రాథమిక విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలు అర్హులైన ప్రతి చిన్నారికి పూర్తిస్థాయిలో అందేలా చూడాలని ఆదేశించారు. కేంద్ర పరిసరాల్లో ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News