Breaking News

జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు డిమాండ్‌

-చిత్తశుద్ధితో ప్రభుత్వ స్పందన..
-సమ్మెను విరమించండి…రోగులకు అండగా నిలవండి
-వాస్తవ వివరాలు – ఓ పరిశీలన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం అందుతున్న స్టైఫండ్‌పై 15 శాతం పెంపు చేయాలని APJUDA డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చర్చించింది. జూనియర్ డాక్టర్లు చెబుతున్న అంశాలతో పాటు ప్రస్తుతం వారికి అందుతున్న స్టైఫండ్, గతంలో చేసిన పెంపులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేట్లు, ప్రభుత్వంపై పడే అదనపు ఖర్చు వంటి విషయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో పెంచడం కంటే క్రమంగా పెంచే విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
జూనియర్ డాక్టర్లతో చర్చలు కొనసాగిస్తూ, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో స్టైపెండ్ 15 శాతం పెంచేందుకు ఆర్థిక శాఖ సుముఖంగా లేదని, అయితే
ప్రతి ఏడాది నిర్దిస్టoగా
ఇంటర్న్‌లకు, PG విద్యార్థులకు తగిన శాతంలో పెంచే ప్రతిపాదన ఉందని ప్రభుత్వం జూడాలకు తెలిపింది. ప్రతి ఏడాది ఇదేవిధంగా పెంపును కొనసాగిస్తామని వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రజల సంక్షేమ పథకాల అమలు దృష్ట్యా ప్రతిపాదిత పెంపునకు ఆమోదం తెలపాలని జూ డాలను కోరుతోంది.

9,501 మందికి స్టైఫండ్

రాష్ట్రంలో MBBS, BDS ఇంటర్న్‌లు, PG విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు, MDS, DNB తదితర కోర్సుల్లో ఉన్న మొత్తం 9,501 మంది స్టైఫండ్ పొందుతున్నారు. వీరికి ప్రస్తుతం నెలకు సుమారు రూ.48.84 కోట్లు, ఏడాదికి సుమారు రూ.586.08 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది.

ప్రస్తుత స్టైఫండ్

01-01-2024 నుంచి అమల్లో ఉన్న రేట్ల ప్రకారం MBBS, BDS ఇంటర్న్‌లకు నెలకు రూ.25,906 ఇస్తున్నారు. PG మొదటి సంవత్సరం వారికి రూ.60,823, రెండో సంవత్సరం వారికి రూ.61,528, మూడో సంవత్సరం వారికి రూ.64,767 చెల్లిస్తున్నారు.

సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు కోర్సు సంవత్సరాన్ని బట్టి రూ.80,500 నుంచి రూ.85,100 వరకు ఇస్తున్నారు. MDS, DNB, ఇతర PG కోర్సుల్లో కోర్సు, సంవత్సరం ఆధారంగా స్టైఫండ్‌లో కొంత తేడా ఉంటుంది.

2026లో మరో పెంపునకు అవకాశం

గతంలో సాధారణంగా రెండేళ్లకు ఒకసారి స్టైఫండ్ పెంచుతూ వచ్చారు. 2018, 2020, 2022, 2024 సంవత్సరాల్లో పెంపులు జరిగాయి. 2020, 2022, 2024లో 15 శాతం చొప్పున పెంచారు. దీంతో 01-01-2026 నుంచి మరోసారి పెంపు చేసే అవకాశం ఏర్పడింది.

2018లో 30 శాతం, 2022లో ఇంటర్న్‌లు, PG విద్యార్థులకు 15 శాతం, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 42 శాతం, 2024లో మరో 15 శాతం పెంపు ఇచ్చారు.

పెంపు ఎందుకు కోరుతున్నారు?

ప్రస్తుతం అందుతున్న స్టైఫండ్‌పై 15 శాతం పెంచాలని APJUDA కోరుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరిగిందని, వైద్య సేవలు విస్తరించాయని, కొత్త స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయని వారు చెబుతున్నారు. దీంతో తమపై పని భారం కూడా పెరిగిందని జూనియర్ డాక్టర్లు అంటున్నారు.
ICUలు, అత్యవసర వైద్యం, క్రిటికల్ కేర్, మెడికో-లీగల్ కేసుల్లో బాధ్యతలు పెరిగాయని APJUDA చెబుతోంది. రోగులకు వైద్యం అందించడంతో పాటు వైద్య విద్య, పరిశోధన, ఆసుపత్రికి సంబంధించిన ఇతర పనులు కూడా చేయాల్సి వస్తోందని పేర్కొంటోంది.

ఇతర రాష్ట్రాల్లో స్టైఫండ్ పరిస్థితి

ఇంటర్న్‌లకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకు రూ.25,906 ఇస్తున్నారు. కర్ణాటకలో రూ.30,000, తెలంగాణలో రూ.29,792, తమిళనాడులో రూ.27,319, కేరళలో రూ.27,300 ఇస్తున్నారు.

ఈ లెక్కల ప్రకారం MBBS ఇంటర్న్‌లకు ఆంధ్రప్రదేశ్‌లో అందుతున్న స్టైఫండ్ కొన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది. ఇదే అంశాన్ని జూనియర్ డాక్టర్లు కూడా తమ డిమాండ్‌లో ప్రస్తావిస్తున్నారు.

అయితే అన్ని కోర్సులు, అన్ని విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌లో స్టైఫండ్ తక్కువగా ఉందని చెప్పడం సరికాదు. సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న మొత్తం కర్ణాటక, కేరళ, తమిళనాడు కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణతో పోలిస్తే మాత్రం తక్కువగా ఉంది. అందువల్ల కోర్సు, సంవత్సరం ఆధారంగా పోల్చాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 9,501 మంది జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ కోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.586.08 కోట్లు ఖర్చు చేస్తోంది.

15 శాతం పెంపు చేస్తే

ఇంటర్న్‌లకు రూ.25,906 నుంచి రూ.29,792
PG మొదటి సంవత్సరం వారికి రూ.60,823 నుంచి రూ.69,946
సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సరం వారికి రూ.80,500 నుంచి రూ.92,575కు పెరుగుతుంది.

ఈ పెంపుతో ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.87.91 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

పెంపును బట్టి ప్రభుత్వంపై అదనపు ఖర్చు

పెంపు| ఏడాదికి అదనపు ఖర్చు
3 శాతం| రూ.17.58 కోట్లు
5 శాతం| రూ.29.30 కోట్లు
10 శాతం| రూ.58.61 కోట్లు
15 శాతం| రూ.87.91 కోట్లు

APJUDA తో కొనసాగుతున్న చర్చలు

స్టైఫండ్ పెంపుపై APJUDA ప్రతినిధులతో ప్రభుత్వం జూలై 17 నుంచి చర్చలు జరుపుతూనే వచ్చింది. తాజాగా ఆగస్టు 15న కూడా వారితో ప్రభుత్వం చర్చలు జరిపిoది. ఈ చర్చల్లో 15 శాతం పెంపు చేయాలన్న తమ డిమాండ్‌ను ప్రతినిధులు కొనసాగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 15% డిమాండ్ తగ్గిoపు పై పున:పరిశీలన చేయాలని అధికారులను వారిని కోరారు. విధులకు వెంటనే హాజరు కావాలని, రోగులకు వైద్య సేవల కొనసాగింపులో అంతరాయం ఏర్పడకూడదని పదేపదే విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు 11 నుంచి నిరసనలు

APJUDA ఆగస్టు 11 నుంచి నిరసన కార్యక్రమాలు ప్రారంభించింది. ఆగస్టు 12 నుంచి 15 వరకు నిరసనలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 17 నుంచి సమ్మెకు వెళ్లాలని APJUDA ప్రకటించింది. ఎమర్జెన్సీ సర్వీసులు నిలపవద్దని, అమలు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి డిమాండ్ పై పున:పరిశీలన చేసి చర్చలకు రావాలని ప్రభుత్వం జూడాను కోరింది

రోగులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు

జూనియర్ డాక్టర్ల నిరసనల కారణంగా రోగులకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ముందుగానే ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
అవసరమైన చోట అదనపు వైద్యులను సిద్ధంగా ఉంచుతున్నారు. అత్యవసర విభాగాలు, ICUలు, ప్రసూతి సేవలు, ఆపరేషన్ థియేటర్లు, NICU, PICU, డయాలసిస్, ట్రామా సేవలు ఆగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
మందులు, ఆక్సిజన్, రక్తం, అవసరమైన వైద్య సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

నిరసనల మధ్య కొనసాగిన వైద్య సేవలు

ఆగస్టు 11న ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో 32,575 OP కేసులు, 2,398 IP కేసులు, 2,647 సర్జరీలు జరిగాయి.

ఆగస్టు 12న 33,035 OP కేసులు, 2,085 IP కేసులు, 2,589 సర్జరీలు నమోదయ్యాయి.

ఆగస్ట్ 13న 34,442 OP కేసులు, 1,159 IP కేసులు, సర్జరీలు 2,122, డెలివరీలు 147 చొప్పున నమోదయ్యాయి.

జూనియర్ డాక్టర్ల సేవలు అత్యంత కేలకు

జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ వైద్య వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించడంలో వారు చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తిస్తోంది. వారి పని భారం, బాధ్యతలు, స్టైఫండ్ పెంపు డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది.

రోగుల వైద్యం విషయంలో రాజీ లేదు

స్టైఫండ్ పెంపు అంశంపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలకు వైద్య సేవలు ఆగకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత.

ముఖ్యంగా అత్యవసర రోగులు, గర్భిణులు, చిన్నపిల్లలు, ICU రోగులు, డయాలసిస్ రోగులు, ప్రమాదాల్లో గాయపడిన వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *