-రాష్ట్రానికి ఆదర్శంగా టూరిజం కం టెంపుల్ టూరిజం అభివృద్ధి
-మంగినపూడి బీచ్‌లో ఉత్సవ కమిటీ కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మంగినపూడి బీచ్ వద్ద ఏర్పాటు చేసిన సాగరతీర మహాగణపతి ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మచిలీపట్నం మంగినపూడి బీచ్‌కు చారిత్రాత్మకంగా ఎంతో గొప్ప పేరుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు వస్తున్నారు. కానీ గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో పర్యాటకం ప్రశ్నార్ధకంగా తయారైంది. అందుకే ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు తీసుకురావడం లక్ష్యంగా గతంలో బీచ్ ఫెస్టివల్ అత్యంత ఘనంగా నిర్వహించాం. ఈ సంవత్సరం మహాగణపతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించాం. ఆ సంకల్పానికి కార్యరూపం దాల్చాం. దాదాపు 63 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ.. సాగరతీర మహాగణపతి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఆద్యాత్మికంగా పర్యాటకంగా మంగినపూడికి మంచి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరం పని చేస్తున్నాం. ప్రతి ఇంటి నుండి, వ్యవసాయ క్షేత్రం నుండి మట్టిని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చాం. ఈ సంకల్పం ద్వారా ఈ ప్రాంతం అత్యంత శక్తివంతమైన ప్రాంతంగా మారుతుందని భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడూ భాగస్వాములవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నమూనా దేవాలయాలు కూడా ఏర్పాటు చేస్తూ.. సాంస్కృతిక కళా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. టెంపుల్ టూరిజం కం టూరిజం అభివృద్ధి చేయాలని ప్రణాళిక రచిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News