-4 మలేరియా డివిజన్లలో 203 మంది కార్మికులతో యాంటీ లార్వా యాక్టివిటీస్
-గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిన డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు
-దోమల నియంత్రణకు ప్రజలు కూడా ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ సహకరించాలి
-గురువారం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ దోమల దినోత్సవం (ఆగస్ట్ 20) సంధర్బముగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులపై అవగాహన పెంచడం, వాటి నుండి రక్షణ పొందే మార్గాలను ప్రచారం చేయడం, నివారణకు ప్రణాలికాబద్దంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో 4 మలేరియా డివిజన్ల ద్వారా 203 మంది కార్మికులతో బయాలజిస్ట్ నేతృత్వంలో దోమల నియంత్రణ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడం వలన గతేడాది ఇప్పటి వరకు మలేరియా-4, డెంగ్యూ-51, చికెన్ గున్యా-8 నమోదవ్వగా, ఈ ఏడాది మలేరియా-0, డెంగ్యూ-26, చికెన్ గున్యా-1 నమోదయ్యాయని తెలిపారు. దోమల వృద్ధి కేంద్రాలను గుర్తించి, నీటి నిల్వలను తొలగించడం, అవసరమైన చోట్ల యాంటీ లార్వల్ చర్యలు చేపట్టడం ద్వారా దోమల లార్వా దశలోనే నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. దోమల సాంద్రత, వ్యాధి వ్యాప్తి పరిస్థితులను బట్టి అవసరమైన ప్రాంతాల్లో ఫాగింగ్ తదితర యాంటీ అడల్ట్ చర్యలను, దోమల లార్వాలను సహజంగా నియంత్రించేందుకు ఇప్పటివరకు సుమారు 15 లక్షల గంబూసియా చేపలను చెరువుల్లో, బావుల్లో విడుస్తూ జీవ నియంత్రణ చర్యలను చేపడుతున్నారని పేర్కొన్నారు. దోమలను ఆకర్షించి ట్రాప్ చేయడంతో పాటు దోమల సాంద్రతను పర్యవేక్షించేందుకు మస్కిటో ట్రాపింగ్ మెషీన్లను ఏర్పాటు, ఆధునిక సెన్సార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దోమల ఉనికి, సాంద్రత మరియు కార్యకలాపాలను పర్యవేక్షించి, అవసరమైన ప్రాంతాల్లో లక్ష్యిత నియంత్రణ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. విస్తృత ప్రాంతాలు, దోమల వృద్ధి ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, 30 చెరువుల్లో మేజర్ డ్రైన్లలో, చేరుకోవడానికి కష్టమైన ప్రాంతాల్లో ఏఐ ఆధారిత డ్రోన్ స్ప్రేయింగ్ చేస్తున్నారన్నారు. దోమల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, కూలర్లు, పూల కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, పాత వస్తువుల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే దోమల ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత రక్షణ చర్యలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, జ్వరం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
Prajavartha Online Telugu News