-సీఎం చంద్రబాబుకు ప్రతిపాదనలు పంపాం
-5,920 మంది అవయవాల కోసం నిరీక్షణ
-కొత్త నిబంధనలతో అవయవదానానికి ఊతం
-‘స్వాప్ దానం’కు అవకాశం
-శాసనసభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
-మంత్రి ప్రవేశపెట్టిన మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లుకు సభ ఆమోదం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జీవన్మృతుల ( బ్రెయిన్‌డెడ్ ) వ్యక్తుల అవయవదానానికి ముందుకొచ్చే కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న రూ.10,000 నుంచి ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లు-2026పై బుధవారం శాసనసభలో ప్రవేశ పెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. అవయవదానం, ప్రాముఖ్యత, ప్రస్తుత పరిస్థితులు, బిల్లులోని ముఖ్యాంశాల గురించి వివరించారు. ఒక బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి ఎనిమిది అవయవాలను సేకరించి అవసరమైన వారికి అందించవచ్చని మంత్రి తెలిపారు.
5,920 మంది నిరీక్షణ
రాష్ట్రంలో సుమారు 5,920 మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. వీరిలో దాదాపు 100 మంది గుండె, 3,000 మంది కిడ్నీ, 2,000 మంది లివర్ మార్పిడి కోసం నిరీక్షిస్తున్నారని మంత్రి వివరించారు. పాంక్రియాస్ మార్పిడి కోసం నలుగురు ఉన్నారని తెలిపారు. పుట్టిన నెల రోజుల వయసున్న శిశువుల నుంచి 90 ఏళ్ల వయసున్నవారి వరకు అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. పదేళ్లలోపు వయసున్న సుమారు 40 మంది పిల్లలు కూడా ఈ జాబితాలో ఉన్నారని వెల్లడించారు.
అపోహలు తొలగింపులో ఎమ్మెల్యేలూ భాగస్వామ్యం కావాలి
అవయవదానంపై అపోహలను తొలగించే దిశగా ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ప్రజల్లో ప్రభావం చూపగల ప్రముఖులను కూడా భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. ఇటీవల విశాఖపట్నంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ద్వారా అవయవదానంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు. అలాగే అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు శాసనసభ్యులు అవయవదానం ప్రాముఖ్యత గురించి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ కల్పనపై పరిశీలన
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవన్మృతుల అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకొస్తే రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని, దాత పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయన్నారు. అలాగే దాతల కుటుంబాల ఆర్థిక నేపథ్యం ఇతర అంశాల ప్రాతిపదికన అర్హులైన వారు ఉంటే పొరుగు సేవలు లేదా ఒప్పంద విధానంలో ఉద్యోగాన్ని ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు
ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపినట్లు స్పష్టం చేశారు.
మూడు నుంచి తొమ్మిదికి అవయవ మార్పిడి కేంద్రాలు
రాష్ట్రంలో ఉన్న ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కేంద్రాల సంఖ్యను మూడు నుంచి తొమ్మిదికి పెంచామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అవయవ మార్పిడి సేవలను విస్తరించడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 12 టీచింగ్ ఆసుపత్రులను కూడా రాబోయే రోజుల్లో ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కిడ్నీ, లివర్ వంటి అవయవాల మార్పిడిలో ప్రైవేటు ఆసుపత్రుల వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ రంగంలోనూ ఈ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని పద్మావతి ఆసుపత్రిలో గత ఏడాది 18 హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరిగినట్లు మంత్రి వెల్లడించారు.
100 మందికి పైగా దాతలు ముందుకొచ్చేలా కృషి
ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అవగాహన కార్యక్రమాల ఫలితంగా అవయవదాతల సంఖ్య పెరుగుతోందని మంత్రి తెలిపారు. 2023లో 41 మంది దాతలు ముందుకు రాగా 126 అవయవ మార్పిడులు జరిగాయి. 2024లో 66 మంది దాతలు ముందుకు వచ్చి 210 అవయవ మార్పిడులు జరిగాయి. 2025లో 93 మంది దాతలు ముందుకు రాగా 300 అవయవ మార్పిడులు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటికే 74 మంది దాతలు ముందుకు వచ్చారని, 200కు పైగా అవయవ మార్పిడులు జరిగినట్లు మంత్రి తెలిపారు. ఏడాది ముగిసేలోగా 100 మందికి పైగా దాతలు, 400కు పైగా అవయవ మార్పిడులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు మార్గదర్శకత్వం మేరకు ఈ రంగంలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
తాత.. అవ్వలకు అవకాశం
బిల్లులో పేర్కొన్న కొత్త నిబంధనలతో భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లతోపాటు తాత, అవ్వ, మేనమామ, మేనత్తలను కూడా దగ్గరి బంధువులుగా గుర్తించను నట్లు మంత్రి తెలిపారు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో అవయవదాన ప్రక్రియను సమన్వయం చేసేందుకు ప్రత్యేక బాధ్యుల నియామకం జరుగుతుందని తెలిపారు తెలిపారు. దాత–గ్రహీతల వివరాలను నమోదు చేసి మార్పిడి ప్రక్రియను పర్యవేక్షిస్తారని చెప్పారు.
‘స్వాప్ దానం’కు అవకాశం
రెండు కుటుంబాల్లో దాత–గ్రహీతలకు అవయవాలు పరస్పరం సరిపడే పరిస్థితుల్లో *‘స్వాప్ దానం’*కు
అవకాశం లభిస్తుందని తెలిపారు. నిర్దిష్ట వైద్య పరిస్థితుల్లో గుండె ఆగిన తర్వాత కూడా అవయవ సేకరణకు అవకాశం ఉంటుంది. మైనర్ల నుంచి అవయవాలు, కణజాలాల సేకరణపై కఠిన పరిమితులు విధించినట్లు తెలిపారు. విదేశీయులకు అవయవదానం విషయంలో ప్రత్యేక అనుమతి తప్పనిసరి చేశామని,
అవయవాల అక్రమ కొనుగోలు, అమ్మకాలు, మధ్యవర్తిత్వాన్ని అరికట్టేందుకు కఠిన శిక్షలు నిబంధనలు రూపొందించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా అవయవం తొలగిస్తే గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు, రూ.20 లక్షల జరిమానా.. అక్రమ వ్యాపారానికి 5–10 ఏళ్ల జైలు, రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయని మంత్రి వివరించారు.
బిల్లుకు ఆమోదం
అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టిన బిల్లుకు చర్చ అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆమోదం తెలిపారు.
Prajavartha Online Telugu News