-రెండేళ్లలో రూ.25 కోట్లతో 548 పనులు చేపట్టాం.
-రెండేళ్ళలో 1800కోట్లతో పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేశాం.
-చంద్రబాబు ముందుచూపు వల్లే ఏలేరు ఆయకట్టుకు నీరిస్తున్నాం.
-అసెంబ్లీలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగు, తాగు నీటి సరఫరా పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సూచనల మేరకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. బుధవారం అసెంబ్లీలో యల్లసిరి కెనాల్ పనులు, ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల సూచనలతో ఇటీవలే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టామని మంత్రి తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు నీరందించాలనే ముందుచూపుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీంను నిర్మించారని పేర్కొన్నారు. సూపర్ ఎల్‌నినో వంటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ 53 వేల ఎకరాల ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు, 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు, తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు సాగు, తాగునీరు అందించే పోలవరం ఎడమ కాలువ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం తట్టమట్టి పని కూడా చేయలేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పోలవరం ఎడమ కాలువ పనులపై రూ.1,800 కోట్లు ఖర్చు చేసి, అత్యంత క్లిష్టమైన పాంపా, తాండవ, ఏలేరు నదుల క్రాసింగ్ పనులతో పాటు 11 హైవే క్రాసింగ్ వంతెనల పనులను పూర్తి చేశామని తెలిపారు. పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీంతో పాటు పోలవరం ఎడమ కాలువ పనులను ముందుకు తీసుకెళ్లడం వల్లే ఏలేరు ఆయకట్టుకు సాగు, తాగు నీరు అందించే పరిస్థితి ఏర్పడిందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏలేరు ఆయకట్టుకు ఇప్పటివరకు 2.6 టీఎంసీల నీటిని పంపిణీ చేశామని మంత్రి వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో ఏలేరు నదీగర్భంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా బెడ్ లెవల్ పడిపోయిందని, దీంతో గ్రావిటీ ద్వారా నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఏలేరు ఆయకట్టు పరిధిలో నిర్వహణ, మరమ్మతుల (O&M) పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మంత్రి ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 548 O&M పనులకు రూ.25 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టిందని తెలిపారు. ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏలేరు ఆయకట్టుకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మరో రూ.15.84 కోట్లతో O&M పనులకు ప్రతిపాదనలు పంపామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఏలేరు ఆయకట్టు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు నిరంతరం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News