– బీమా నమోదుకు ఈ నెలాఖరు వరకే గడువు
– ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతు బీమా రక్షణ పొందాలి
– రైతు చెల్లించాల్సిన ప్రీమియం వాటా స్వల్పమే
– ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో రైతులకు అవగాహన కల్పించాలి
– అసెంబ్లీ వేదికగా రైతులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమా విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉన్నందున రైతులు ఆలస్యం చేయకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ వేదికగా పిలుపునిచ్చారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో అంచనా వేయలేమని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం వంటి పరిస్థితుల్లో రైతుకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. రైతులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
రైతుపై ప్రీమియం భారం చాలా స్వల్పమే
పంటల బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటా చాలా తక్కువగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాంతం, పంటను బట్టి రైతు వాటా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో రైతు చెల్లించాల్సిన మొత్తం అత్యంత స్వల్పంగా ఉందన్నారు. మిగిలిన ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని వివరించారు. స్వల్ప మొత్తాన్ని చెల్లించడం ద్వారా పంట నష్టం సంభవించినప్పుడు బీమా రక్షణ పొందే అవకాశం ఉన్నందున రైతులు దీనిని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి
పంటల బీమా నమోదును కేవలం వ్యవసాయ శాఖ కార్యక్రమంగా చూడకుండా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, పంటల బీమా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్హులైన రైతులందరూ బీమా నమోదు చేసుకునేలా ఎమ్మెల్యేలు చొరవ చూపాలని కోరారు. ఎల్‌నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమాను తేలికగా తీసుకోవద్దు. ఈ నెలాఖరు వరకే అవకాశం ఉంది. చివరి రోజు వరకు వేచి చూడకుండా ప్రతి రైతు వెంటనే నమోదు చేసుకోవాలి. స్వల్ప ప్రీమియంతో లభించే బీమా రక్షణను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి అని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News