-సెంట్రల్ నియోజకవర్గంలో ఘనంగా ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
-ఆంధ్రజాతి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రకేసరి
-బ్రిటీష్ తుపాకులకు ఎదురొడ్డిన నిజమైన ఆంధ్రకేసరి
-మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు శోభాయమానమైన ధీరోదాత్తుడు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ, ఒంగోలు జిల్లాలో జన్మించి, న్యాయవాదిగా ఉన్నత విద్యనభ్యసించి, లండన్‌లో బారిస్టర్‌గా అర్హత సాధించినప్పటికీ.. దేశ సంక్షేమం కోసం మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి స్వాతంత్ర్య ఉద్యమంలోకి అడుగుపెట్టారని కొనియాడారు. స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా బ్రిటీష్ సైన్యం తుపాకులు గురిపెట్టి కాల్పులు జరుపుతుంటే.. ఏమాత్రం భయపడకుండా గుండె చూపించి ఎదురొడ్డి నిలిచిన అసమాన ధీరుడు ప్రకాశం పంతులు అని మల్లాది విష్ణు గుర్తుచేశారు. ఆ సంఘటన ద్వారానే ఆయన తెలుగు వారి పౌరుషానికి, ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా ఆంధ్రకేసరి గా నిలిచారన్నారు. తన యావదాస్తిని సైతం ప్రజల కోసమే త్యాగం చేశారని, రాజమండ్రి మున్సిపల్ ఛైర్మన్‌గా, మద్రాస్ ప్రెసిడెన్సీలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన కాలంలోనే రైతులు, విద్యార్థులు, మహిళల శ్రేయస్సు కోసం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటం, క్విట్ ఇండియా ఉద్యమాలలో ముందుపీఠిన నిలిచారని, జాతీయ భావాలను నలుదిశలా వ్యాప్తి చేసేందుకు స్వరాజ్యం పత్రికను నడిపారని చెప్పారు. స్వార్థ ప్రయోజనాలను పక్కనబెట్టి దేశ భవిష్యత్తు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించిన టంగుటూరి బాటలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని విష్ణు స్పష్టం చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నేటి జగన్ మోహన్ రెడ్డి వరకు ప్రకాశం పంతులు ఆశయాలను, అడుగుజాడలను పునికిపుచ్చుకునే పాలన అందించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న పోలీసు రాజ్యానికి, ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే ఆయనకు మనం అర్పించే ఘనమైన నివాళి అని పిలుపునిచ్చారు. కార్యక్రమం చివర్లో నాయకులు, కార్యకర్తలు జోహార్ టంగుటూరి ప్రకాశం పంతులు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, దోనేపూడి శ్రీనివాసరావు, ఆదినారాయణ, తాడి శివ, యర్రంశెట్టి అంజిబాబు, బండారు ఆంజనేయులు, కంకింపాడు కృష్ణ, చల్ల సుధాకర్, శివారెడ్డి, విశ్వప్రసాద్, మల్లెల శ్రీనివాసరావు, చందు, కందకట్ల శ్రీనివాసరావు బేరవ శ్రీను, రాము, మీసాల సత్యనారాయణ, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News