ఉయ్యూరులో డయేరియా లక్షణాలపై కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక దృష్టి

-5, 18, 19వ వార్డుల్లో తాగునీటి కాలుష్యంపై సమగ్ర తనిఖీలు – ప్రతి ఇంటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశం

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ ఉయ్యూరులో డయేరియా లక్షణాల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉయ్యూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి, డయేరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న రోగులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారుల వివరాల ప్రకారం ఇప్పటివరకు 26 మంది డయేరియా లక్షణాలతోటి సిహెచ్సిలో అడ్మిట్ అయ్యారని వారిలో 18 మంది డిశ్చార్జ్ అయ్యారని మిగతా ఎనిమిది మందికి వైద్య సేవలు అందుతున్నాయని వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు

రోగులకు అందుతున్న వైద్య సేవలు, డయేరియా లక్షణాలు కనిపించడానికి గల కారణాలు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. రోగులు, వారి బంధువుల నుంచి వివరాలను స్వయంగా తెలుసుకున్నారు.

అనంతరం సమస్యకు మూల కారణాన్ని గుర్తించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీ సోమశేఖర్, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీ ప్రవీణ్‌లను వెంటనే, సంబంధిత అధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రత్యేకంగా ఉయ్యూరు పట్టణంలోని 5, 18, 19వ వార్డుల్లో ప్రతి ఇంటినీ సందర్శించి తాగునీటి సరఫరా వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎక్కడైనా నీటి కాలుష్యం లేదా కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే కారణాలను నిర్ధారించి, తీసుకోవాల్సిన సరిదిద్దే చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి పైపులైన్లు, లీకేజీలు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా మార్గాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు లేకుండా తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

డయేరియా లక్షణాలకు గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు అన్ని కోణాల్లో విచారణ జరిపి, అవసరమైన సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి కాలుష్యానికి గల కారణాలను గుర్తించి, సమస్య పునరావృతం కాకుండా చేపట్టాల్సిన శాశ్వత సరిదిద్దే చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, డయేరియా లక్షణాల నియంత్రణకు వైద్య, ఆర్‌డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *