-రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత
-మొదటి విడతలో 71,536 మందికి ఆర్థిక సాయం
-రెండో విడతలో మిగిలిన అర్హులకూ రూ.25 వేలు అందజేస్తాం
-కొత్తగా 36,617 దరఖాస్తులు రాక
-ఈ నెలాఖరు వరకూ లబ్ధిదారుల ఎంపిక
-ఆ వెంటనే బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ
-చేనేతల వెంటే కూటమి ప్రభుత్వం
-నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయం
-ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా ‘నేతన్నల సేవలో’ అమలు చేస్తున్నాం
-నేతన్నల సేవలో పథకంపై గొడ్డలి పార్టీ కుట్రలు
-వైసీపీ ట్రాప్ లో నేతన్నలు పడొద్దు : మంత్రి సవిత పిలుపు
పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం అందజేస్తామని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఈ నెలాఖరు వరకూ రెండో విడత లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం జరుగుతోందని, ఆ వెంటనే అర్హుల బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. నేతన్నల కళ్లలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా నేతన్నలసేవలో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. నేతన్నల సేవలో పథకంపై గొడ్డలి పార్టీ అపోహలు సృష్టిస్తోందని, ఆ పార్టీ నేతల ట్రాప్ లో నేతన్నలు పడొద్దని మంత్రి సవిత పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయం తరవాత అత్యధికంగా చేనేత వృత్తిపై అత్యధిక ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనంతో కూడిన ఉపాధిని 365 రోజుల పాటు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. 2014-19 పాలనా కాలంలో మొట్టమొదటిసారిగా 50 ఏళ్లు నిండిన చేనేతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, నేతన్నలకు ఇచ్చే రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 86 వేల మంది నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేశామన్నారు. మగ్గం నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేసే నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 51,952 మంది నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అందిస్తున్నామని తెలిపారు.
చేనేతలకు 365 రోజులూ ఉపాధే ధ్యేయం
నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు సంకల్పమని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా క్లస్టర్లు, టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా రెడీ మేడ్ దుస్తుల తయారీలో చేనేతలకు శిక్షణ సైతం అందిస్తున్నామన్నారు. ఏటా త్రిఫ్ట్ ఫండ్ నిధులు, 90 శాతం రాయితో పనిముట్లు అందజేస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా విస్తృతంగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. రూ.10.44 కోట్లతో 10 చిన్న క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధర్మవరంలో రూ.38 కోట్లతో మెగా చేనేత క్లస్టర్, మంగళగిరిలో చేనేత పార్క్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
అర్హులైన నేతన్నలందరికీ ఆర్థిక సాయం
ఎన్నికల్లో హామీ ఇవ్వనున్నా చేనేతలకు ఆర్థిక మేలు కలుగజేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబునాయుడు నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మొదటి విడతగా 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించామన్నారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చాయని, ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమంలో ఈ నెలాఖరులో పూర్తవుతుందని, ఆ వెంటనే రెండో విడతలో భాగంగా మిగిలిపోయిన అర్హులకు రూ.25 వేలు అందజేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క నేతన్నకూ నేతన్నల సేవలో పథకం వర్తింప చేస్తామని మంత్రి సవిత స్పష్టంచేశారు.
‘నేతన్నల సేవలో’పై గొడ్డలి పార్టీ అపోహాలు
నేతన్నలకు మేలు చేయడం ఇష్టంలేని గొడ్డలి పార్టీ నాయకులు కుట్రలకు తెరతీశారని మంత్రి సవిత మండిపడ్డారు. ఈ పథకం అమలుపై తప్పుడు ప్రచారం చేస్తూ, అపోహాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేతన్నలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైసీపీ ట్రాప్ లో పడొద్దని పిలుపునిచ్చారు. మగ్గం కలిగి ఉన్న ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు.
Prajavartha Online Telugu News